ఆర్మూర్/నందిపేట్ (మాక్లూర్) ఫిబ్రవరి 6: నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతున్నది. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన తరువాత చేరికలు ఊపందుకొన్నాయి. ఆదివారం ఆర్మూర్ నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన వందలాది మంది జీవన్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో టీఆర్ఎస్లో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీకి చెందిన ఆర్మూర్ మండలం పిప్రి ఎంపీటీసీ సభ్యురాలు దేగాం ఎర్రవ్వతోపాటు 300 మంది యువకులు, ఆర్మూర్‌కు చెందిన వందమంది ముస్లింలు, మాక్లూర్ మండల ఒడ్యాట్పల్లికి చెందిన అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు 32 మంది (బీజేపీ), ప్రైవేట్ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్కంపల్లి సాగర్ తదితరులు టీఆర్ఎస్లో చేరారు. అనంతరం జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. దళితబంధు, రైతుబంధు, రైతుబీమా వంటి అద్భుత పథకాలను అమలు చేస్తున్న తెలంగాణలో తమను విలీనం చేయాలని మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన పలు గ్రామాల ప్రజలు వారి ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు.