సంగారెడ్డి, జనవరి 14 : పతంగులు ఎగురవేసే మాంజా వలస కార్మికుడి ప్రాణం తీసింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని ఫసల్వాదిలో బుధవారం చోటుచేసుకున్నది. సంగారెడ్డి రూరల్ ఎస్సై మధుసూదన్‌రెడ్డి కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని లికింపూర్ జిల్లా హరియాఖేరి గ్రామానికి చెందిన అవదీశ్కుమార్ (38) వరినాట్లు వేసేందుకు ఫసల్వాది గ్రామానికి కుటుంబంతో వచ్చాడు. కొద్దిరోజులుగా ఫసల్వాదిలోనే ఉంటూ వరినాట్లు వేస్తున్నాడు.
అవదీశ్కుమార్ ఉదయం 11.30 గంటల ప్రాంతంలో కూరగాయల కోసం బైక్‌పై ఫసల్వాది నుంచి సంగారెడ్డి పట్టణానికి బయలుదేరాడు. ఫసల్వాదిలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలోకి చేరుకోగానే మాంజా మెడకు తగిలి గొంతు కోసుకుపోయింది. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే 108 అంబులెన్స్‌లో సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించగా, పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడి కుమారుడు ప్రతాప్ భాస్కర్ ఫిర్యాదు మేరకు సంగారెడ్డి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అవదీశ్కుమార్ సాధారణ మాంజా వల్లే చనిపోయాడని ఎస్సై తెలిపారు.