RRR Survey | ‘దొంగ రాత్రి వేళ పల్లెల మీద డ్రోన్లు తిరిగుతున్నయ్. పంట పొలాల్లో కొత్త మనుషులు తిరుగుతున్నరు. పొద్దున లేచి చేనుకు పోతే హద్దు రాళ్లు పాతి, వాటి మీద ‘X’ ఆకారంలో ఎర్ర రంగు గుర్తులు పెట్టి ఉంటున్నయ్. ఇది ఎవడు పెట్టిండో.. ఎందుకు పెట్టిండో.. దొంగోని పనో? దొరోని పనో? జర పట్టుకొని జెప్పుండ్రి సారు’ అని ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు సమీపంలోని గ్రామాల రైతులు, ప్రజలు ఇటీవల పోలీసు స్టేషన్లకు వరుసకట్టారు. పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు కానీ ఇప్పటి వరకు ఏమీ తేల్చలేదు. తాజాగా డ్రోన్ల గుట్టు బయటపడింది. అవి రీజినల్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంటు కోసం సర్వే శాఖ నుంచి ఎగిరిన డ్రోన్లు అని తేలింది.
(నమస్తే తెలంగాణ నెట్వర్క్) ప్రజాప్రయోజనాల కోసం ప్రభుత్వం భూ సేకరణ చేస్తే అధికారులు ముందుగా ఫీల్డ్ విజిట్ చేయాలి. రైతులతో మాట్లాడాలి. సంబంధిత గ్రామాల్లో సభలు, సమావేశాలు పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారంపై రైతులను చైతన్యం చేయాలి. ఇది రాజ్యాంగ బద్ధంగా ఆమోదించబడిన భూ సంస్కరణ చట్టం రైతులకు కల్పించిన హక్కు. ఇప్పటివరకు నగరం ఉత్తర దిక్కు వైపు ఇదే రీజినల్ రింగ్ రోడ్డు కోసం చేసిన భూ సేకరణలో భూ సంస్కరణ చట్టం నిబంధనలనే పాటించి అప్పటి కేసీర్ ప్రభుత్వం భూ సేకరణ చేసింది.
కానీ ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్డుకు ఏ చట్టమూ లేదు. అధికారుల ఫీల్డ్ విజిట్ లేదు. రైతులకు సమాచారం లేదు. సర్వే అధికారులు దొంగల తీరున అర్ధరాత్రి, అపరాత్రి వేళ పంట పొలాల మీద పడిపోతున్నారు. సర్వే కోఆర్డినేట్ మిషన్ చూపిన చోట హద్దు రాళ్లు పాతుతున్నారు. వాటికి రంగులు వేసి వెళ్లిపోతున్నారు. మరో దొంగ రాత్రి వేళకు డ్రోన్లను పంపి అలైన్మెంటు చేస్తున్నారు. నగరానికి దక్షిణం దిక్కు రింగు రోడ్డు ప్రతిపాదిత అలైన్మెంటు కాదని ఒక ముఖ్యనేత కనుసన్నల్లో పంట పొలాల్లో పాము తిరిగినట్టు అష్టవంకర్లు తిరుగుకుంటూ వెళ్లిపోతున్నది. ఇటు మంచాల, యాచారం మండలాల నుంచి మొదలు వెల్దండ, మీదుగా ఇటు పూడూరు మండలంలోని గ్రామాల వరకు ఇదే తంతు.
ఈ నెల ఎనిమిదో తేదీ రాత్రి నుంచి వరుసగా నాలుగు రాత్రులు అంటే 12వ తేదీ వరకు యాచారం, చింతపట్ల మండలాల్లో డ్రోన్లు తిరిగాయి. యాచారం మండలం చింతపట్ల, మొండిగౌరెల్లి గ్రామాలు, మంచాల మండలంలోని చీదేడు, రంగాపూర్, జాపాల, మంచాల, కాగజ్పట్ గ్రామాలపై డ్రోన్లు తిరిగాయి. రాత్రి 9 గంటల ప్రాంతంలో పంట పొలాల్లోకి కొత్త మనుషులు వచ్చే వారని, 11 గంటలకు డ్రోన్లు లేచి తెల్లవారుజాము వరకు చెలకల మీద తిరిగాయని, 4 నుంచి 7 గంటల వరకు కొద్దిపాటి వ్యవధితో డ్రోన్లు ఒకదాని వెంట ఒకటి వచ్చేవని, దేనికది పది నుంచి పదిహేను నిమిషాల పాటు స్థిరంగా ఒక చోటే ఉండేదని గ్రామస్థులు చెప్పారు.
‘మొదట పశువుల దొంగలు డ్రోన్లతోటి గొర్రెలు, బర్రెలు, మేకల జాడలు గుర్తించటానికి వాడుతున్నారేమో అనుకున్నాం. డ్రోన్ల కదలికలపై నిఘా పెట్టి పట్టుకునేందుకు రాత్రంతా జాగారం చేశాం. కొందరం గుట్టల చాటున కాపు కాశాం’ అని దాట్పల్లి గ్రామస్థులు చెప్పారు. మరి కొద్ది రోజులకే పంట పలాల్లో హద్దురాళ్లు పాతినట్టు గుర్తించామని, ఏమి జరుగుతుందో తెలియక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రంగాపూర్ గ్రామస్థులు తమ అనుభావాలను వివరించారు. హద్దు రాళ్లు పాతిన చోటు నుంచి జియో కేబుల్ లైన్ పోతున్నదని, రైతుల భూమికి ఎటువంటి ఇబ్బంది ఉండదని, పైగా నష్టపరిహారం కూడా ఇస్తారని తమ ఊరి వాళ్లే కొందరు ప్రచారం చేశారని మేడిపల్లి గ్రామానికి చెందిన రైతు చెప్పారు.