కొత్తగూడెం గణేశ్ టెంపుల్, సెప్టెంబర్ 23 : పెండింగ్లో ఉన్న ఐదు నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పద్మ, సుల్తానా మాట్లాడుతూ ఐదు నెలలు వేతనాలు ఇవ్వకపోవడంతో కుటుంబసభ్యులతో పండుగ పూట పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. అప్పు చేసి మధ్యాహ్న భోజనం వండి పెడుతుంటే వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని విమర్శించారు. కోడిగుడ్ల బిల్లులు, పెండింగ్ జీతాలు, గౌరవ వేతనం రూ.10 వేల చొప్పున వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.