హనుమకొండ, ఆగస్టు 11 : హనుమకొండ జిల్లా కేంద్రం రాంనగర్‌లోని మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్ర(ప్రైవేట్ సంస్థలకు)కు ఇవ్వొద్దని సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు మంత్రి ఇంటిని ముట్టడించారు. రూ.3వేల గౌరవ వేతనం ఉండగా ఎన్నికల సమయంలో రూ.10 వేలకు పెంచుతానని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు అమలు చేయకపోవడడమే గాక మధ్యాహ్న భోజనం పథకాన్ని అక్షయపాత్రకు అప్పగిస్తూ ఓట్ల కోసం మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళగా మంత్రి సాటి మహిళల సమస్యలను అర్థం చేసుకొంటుందని వస్తే అరెస్ట్ చేయించడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు.
కార్మికులు మంత్రి ఇంటిలోకి చొచ్చుకుపోయేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మాధవి మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్రకు అప్పగించడంవల్ల ప్రభుత్వ పాఠశాలల్లో 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికులకు ఉపాధి పోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. సర్కారు ఈ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని, లేదంటే సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.