ఖైరతాబాద్, ఆగస్టు 21 : సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ అనుబంధ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం లక్డీకాపూల్‌లోని జిల్లా విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు కే స్వప్న, ఎస్వీ రమ మాట్లాడుతూ .. మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్‌కు అందజేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
రెగ్యులర్ డీపీహెచ్ నియామకానికి కసరత్తు
హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్య శాఖలో రెగ్యులర్ డీపీహెచ్ నియామకానికి కసరత్తు జరుగుతున్నది. ఈ నెలాఖరులోగా నియమించే అవకాశాలు ఉన్నట్టు వైద్యశాఖ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు తాజాగా ఐదుగురు అడిషనల్ డైరెక్టర్ల ప్రాథమిక సీనియారిటీ జాబితాను డీపీహెచ్ కార్యాలయం విడుదల చేసింది. ఈ జాబితాలో రవీంద్రనాయక్, అమర్‌సింగ్ నాయక్, మోజీరాం రాథోడ్, కే పద్మజ, ఆర్ పుష్ప ఉన్నారు. ఈ జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని పేర్కొన్నారు. సీనియారిటీ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న రవీందర్ నాయక్‌నే రెగ్యులర్ డీపీహెచ్గా నియమించే అవకాశాలు ఉన్నాయని వైద్యశాఖ వర్గాలు చెప్తున్నాయి.