నల్లగొండ, మార్చి 5 : ఎంజీయూలో ఎంఏ సైకాలజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వాడపల్లి నవీన్ హాస్టల్ అడ్మిషన్‌ను వర్సిటీ అధికారులు బుధవారం రద్దు చేశారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థినులకు గొడ్డుకారం పెడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ కావడానికి వాడపల్లి నవీన్ కారణమని యూనివర్సిటీ డైరెక్టర్ దోమల రమేశ్ నోటీస్ ఇచ్చారు. గత నెలలో యూనివర్సిటీలో గొడ్డుకారం పెడుతున్నారనే విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా, రైతు ధర్నాలో పాల్గొనేందుకు జనవరి 21న నల్లగొండకు వచ్చిన కేటీఆర్‌కు ఇదే విషయాన్ని యూనివర్సిటీ విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీనికి కారణం వాడపల్లి నవీన్ అని యూనివర్సిటీలో వేసిన కమిటీ నిర్ధారించినట్టు నోటీసులో పేర్కొన్నారు. నవీన్‌కు సమాచారం ఇవ్వకుండానే మంగళవారం అతడి రూమ్ డోర్‌కు నోటీస్ అంటించి బుధవారం సెక్యూరిటీ గార్డ్‌తో విద్యార్థిని హాస్టల్ నుంచి గెంటి వేయించారు. నోటీస్‌కు వారం రోజుల గడువు ఉండగా తన వివరణను రాసి అదే రోజు సాయంత్రం డైరెక్టర్ దోమల రమేశ్‌కు ఇచ్చేందుకు వెళ్తే పట్టించుకోలేదని, వివరణ లెటర్ తీసుకోకుండానే వెనక్కి పంపించారని నవీన్ ఆవేదన వ్యక్తంచేశారు.