వరంగల్ చౌరస్తా, జూలై 28 : వరంగల్ ఎంజీఎం దవాఖాన ఆవరణలోని నర్సింగ్ స్కూల్ గదిలో పైకప్పు పెచ్చులు ఊడిపడిపడ్డాయి. ఆదివారం రాత్రి సుమారు 9.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోగా, సోమవారం ఉదయం విషయం వెలుగుచూసింది. మొదటి అంతస్తులోని తరగతి గదిలో భారీగా పెచ్చులు ఊడిపడటంతో విద్యార్థినులు ఆందోళనకు గురవుతున్నారు.
ఆ సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. తరగతులు జరిగే సమయంలో పెచ్చులు ఊడి పడితే పరిస్థితి మరోరకంగా ఉండేదని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఎంజీఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిశోర్కుమార్ను వివరణ కోరగా.. భవనం మరమ్మతుల విషయమై గతంలోనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు.
డీఎంఈ వెంటనే స్పందించి భవనానికి మరమ్మతులు చేపట్టాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. ఘటన జరిగిన భవనంలోకి మీడియాను అనుమతించక పోవడంతో పలువురు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.