హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): ఇప్పటివరకు నాగోల్, మియాపూర్ మెట్రో రైలు డిపో ప్రాంతాల వద్ద ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించిన మెట్రో రైలు ఇకనుంచి పార్కింగ్ ఫీజులు వసూలు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ నెల 25 నుంచి నాగోల్ పార్కింగ్ లాట్లో, సెప్టెంబర్ 1 నుంచి మియాపూర్ మెట్రో పార్కింగ్ లాట్లో పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తామని ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా నాగోల్ మెట్రోస్టేషన్ పక్కనే ఉన్న పార్కింగ్ లాట్లో పెయిడ్ పార్కింగ్ విధానాన్ని ప్రయోగ్మాతకంగా అమలు చేయడంతో ఆగ్రహానికి గురైన మెట్రో రైలు ప్రయాణికులు బుధవారం ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.