Hyderabad Metro | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబరు 26 (నమస్తే తెలంగాణ): నగరంలో ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు మెట్రో రైలు ఉంది. ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు.. మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు ప్రభుత్వం మెట్రోను విస్తరించాలనుకుంటున్నది. మరి… ఎల్బీనగర్-మియాపూర్ మెట్రోను ఎల్అండ్టీ నిర్వహిస్తున్నపుడు రేపు విస్తరించే ప్రాజెక్టుల నిర్వహణ ఎవరు చూస్తారు? సామాన్యుడికి సైతం వచ్చే సందేహం ఇది. కానీ ఏడాదిపాటు మెట్రో విస్తరణ ప్రాజెక్టుపై కసరత్తు చేసిన హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్), ప్రభుత్వానికి మాత్రం ఈ సందేహం రాలేదా? వచ్చినా ఉద్దేశపూర్వకంగా డీపీఆర్‌లో ఈ అంశాన్ని పొందుపరచలేదా? వాస్తవమేదైనా… సర్కారు తప్పిదం తెలంగాణ ప్రజలపై రూ.15వేల కోట్ల మెట్రో భారం మోపింది. ‘ప్రభుత్వంలో ఉన్నవాళ్లం! ఎల్అండ్టీని మనం అడిగేదేముంది!’ అన్న తరహాలో కాంగ్రెస్ సర్కారు దుందుడుకు చర్య 20 ఏండ్ల పాటు అనవసరపు మెట్రో నిర్వహణ బాధ్యత ప్రభుత్వ భుజాలపై వేసింది.
ఎల్అండ్టీని పరిగణించని ప్రభుత్వం
హైదరాబాద్ మహా నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ (ఏ) కింద వివిధ మార్గాల్లో 76.4 కిలోమీటర్ల విస్తరణ ప్రాజెక్టుల్ని రూ.24,269 కోట్లతో చేపట్టేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం డీపీఆర్ తయారు చేసింది. దీంతోపాటు రెండో దశ (బీ) కింద పలు మార్గాల్లో మరో 86.1 కిలోమీటర్ల విస్తరణ ప్రాజెక్టును రూ.19,579 కోట్లతో చేపడతామని డీపీఆర్‌లో పొందుపరిచింది. అంటే ఇప్పుడున్న 69 కిలోమీటర్ల మొదటి దశకు అదనంగా మరో 162.5 కిలోమీటర్ల విస్తరణను రూ.43,848 కోట్లతో చేపట్టాలని అనుకుంది. అలాంటప్పుడు డీపీఆర్ తయారు చేసే సమయంలోనే మొదటి దశ మెట్రో నడుపుతున్న ఎల్అండ్టీని పరిగణలోనికి తీసుకొని, వారితో మాట్లాడాలి. ఏ ప్రభుత్వమైనా భవిష్యత్తులో సాంకేతికంగా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు చేపట్టే ముందుచూపు చర్య ఇది. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ఎల్అండ్టీని తమ దరిదాపుల్లోకి కూడా రానీయలేదని స్పష్టమవుతున్నది.
ఎందుకంటే.. గతంలో హైదరాబాద్ మెట్రో ఎండీ, ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఎన్వీఎస్ రెడ్డి ఒక సందర్భంలో మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. మొదటి దశతో విస్తరణ ప్రాజెక్టుల అనుసంధానంలో ఎల్అండ్టీతో ఎలాంటి సమస్య లేదు అని స్పష్టం చేశారు. కానీ ఎల్అండ్టీ కేంద్రానికి లేఖ రాస్తూ మెట్రో విస్తరణ ప్రాజెక్టులో మేం భాగస్వాములం కాలేం, పైగా మొదటి దశను కూడా ప్రభుత్వాలే తీసుకోండి అని బాంబు పేల్చే వరకు అసలు విషయం బయటికి రాలేదు. మరి.. మెట్రో ఎండీగా 15 ఏండ్ల పాటు ఎల్అండ్టీతో టచ్‌లో ఉన్న ఎన్వీఎస్ రెడ్డి సమస్య లేదని చెప్పిన చాలాకాలం తర్వాత ఆ కంపెనీ మాత్రం సమస్య ఉందని కేంద్రానికి లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంటే ఆదిలో ఎల్అండ్టీ సుముఖంగానే ఉన్నా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పిలిచి మాట్లాడకపోవడం, ఏకపక్షంగా మెట్రో విస్తరణ ప్రాజెక్టులపై ముందుకుపోతుండటంతో ఆ కంపెనీ గుడ్‌బై చెప్పాలనే సంచలనం నిర్ణయం తీసుకుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
2100 కోట్లతో ఒడిసేదానికి 15వేల కోట్ల భారం!
వాస్తవానికి కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే అప్పుల భారం ఉందన్న ఎల్అండ్టీకి ఆర్థికంగా ఊరట కల్పించేందుకు రూ.3వేల కోట్ల వడ్డీలేని రుణం ఇవ్వాలని ఒప్పందం జరిగింది. అందులో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం రూ.900 కోట్లు ఇచ్చింది. అంటే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మిగిలిన రూ.2100 కోట్లు సర్దుబాటు చేస్తే సరిపోయేది. ప్రభుత్వం అప్పు ఇచ్చినందుకు ఎల్అండ్టీ మెట్రో విస్తరణ ప్రాజెక్టుల్లోనూ పాల్గొనేది. పైగా ప్రభుత్వానికి ఎల్అండ్టీ తిరిగి రూ.3వేల కోట్లు చెల్లించేది. వీటన్నింటికీ మించి.. 2010 సంవత్సరంలో వైఎస్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా 35 ఏండ్ల పాటు ఎల్అండ్టీ నిర్వహణ బాధ్యతను చూడాల్సి ఉంది. ఆ మేరకు 2045 వరకు మెట్రో మొదటిదశ నిర్వహణ బాధ్యతను ఆ కంపెనీనే చూసుకునేది. ఆ తర్వాత ఒప్పందం ప్రకారం మెట్రో ప్రాజెక్టుతోపాటు ఆ కంపెనీకి అప్పగించిన 260 ఎకరాలకుపైగా అత్యంత విలువైన భూములు తిరిగి ప్రభుత్వానికే దక్కేవి. కానీ ఇప్పుడు రూ.2వేల కోట్లను ప్రభుత్వం ఎల్అండ్టీకి ఇచ్చేందుకు అంగీకరించింది. గతంలోని రూ.900 కోట్లు కలుపుకుంటే రూ.2900 కోట్ల నగదును ప్రభుత్వం ఆ కంపెనీకి చెల్లించినట్లయింది. ఇందుకు ప్రతిగా రూ.13వేల కోట్ల కంపెనీ అప్పులను ప్రభుత్వం భుజానికి ఎత్తుకుంది. ఇది ప్రభుత్వం తీరుతో రాష్ట్రంపై పడుతున్న మోయలేని భారం.