మెట్పల్ల్లి, జనవరి 15 : మార్టిగేజ్ కోసం రూ.5 వేలు లంచం తీసుకుంటూ బుధవారం జగిత్యాల జిల్లా మెట్పల్లి సబ్‌రిజిస్ట్రార్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ కరీంనగర్ డీఎస్పీ రమణామూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్‌కు చెందిన సుంకే విష్ణు బ్యాంకు ఉద్యోగి. మెట్పల్లిలో 266 గజాల ఇంటి స్థలం సేల్‌డీడ్, మార్టిగేజ్ రిజి్రస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్ రైటర్‌తో దస్తావేజులు తయారు చేయించారు. గత నెల 28న డాక్యుమెంట్ రైటర్ వద్ద సహాయకుడిగా పనిచేసే ఆర్మూర్ రవి సబ్‌రిజిస్ట్రార్ మహమ్మద్ అసిఫొద్దీన్ వద్దకు సదరు దస్తావేజులను తీసుకెళ్లాడు. సేల్‌డీడ్, మార్టిగేజ్ డీడ్ రిజిస్ట్రేషన్‌కు రూ.10 వేలు లంచం డిమాండ్ చేశారు. అయితే విష్ణు డబ్బులు ఇవ్వకపోవడంతో రిజిస్ట్రేషన్ చేయకుండా పక్కన పెట్టారు. చివరకు రూ.5 వేలకు ఒప్పందం కుదిరింది. విష్ణు డాక్యుమెంట్ రైటర్ సహాయకుడి ద్వారా సబ్‌రిజిస్ట్రార్ వద్దకు వెళ్లగా.. అటెండర్ బానోతు రవికుమార్‌కు డబ్బులు ఇవ్వాలని సూచించారు. సబ్‌రిజిస్ట్రార్ చెప్పినట్టుగానే అటెండర్‌కు రూ.5 వేలు లంచం ఇస్తుండగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సబ్‌రిజిస్ట్రార్ మహమ్మద్ అసిఫొద్దీన్, అటెండర్ రవికుమార్‌తోపాటు డాక్యుమెంట్ రైటర్ సహాయకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురిని కరీంనగర్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.