హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ నియోజకవర్గంలో స్పీకర్ అవినీతిని త్వరలో ఆధారాలతో సహా బయట పెడుతానని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మెతుకు ఆనంద్ చెప్పారు. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే తనకు లీగల్ నోటీసులు పంపారని మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఉడత ఊ పులు, తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని స్పష్టంచేశారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి పా లనా వైఫల్యాలు, అవినీతి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావుకు సీట్, బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు లీగల్ నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు. వికారాబాద్ నియోజకవర్గంలో కూడా అధికార పార్టీ అవినీతిని బయటపెడుతున్నందుకే నోటీసులకు తెర లేపారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ తరఫున అవినీతిని బయటపెడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.
వికారాబాద్‌లో స్పీకర్ కుటుంబసభ్యుల కోసమే రిజర్వేషన్లు మార్చుకున్నారని బయట టాక్ నడుస్తున్నదని మాత్రమే తాను చెప్పానని, ఈ అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశానని ఆయన వెల్లడించారు. రిజర్వేషన్లు మార్చడంతో అన్ని పార్టీల లీడర్లు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంలో తలలు పట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గౌరవప్రదమైన స్పీకర్ పదవితోపాటు అన్ని పదవులు గడ్డం ప్రసాద్ కుటుంబానికేనా అని మాత్రమే తాను ప్రశ్నించానని గుర్తుచేశారు. ఆయా పార్టీల నేతల మనోగతాన్నే తాను బహిర్గతపర్చానని చెప్పారు. ఈ విషయాలకు సమాధానం చెప్పాలని అడిగితే రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేశారని తెలిపారు. గతంలో కేసీఆర్, కేటీఆర్ సహా ఇతర నేతలపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ చేసిన వ్యాఖ్యలకు ఎన్ని వేల కోట్ల పరిహారం చెల్లిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో ఆధారాలతో సహా మరికొన్ని లీలలను బయట పెడుతామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు కేవలం డొంక మాత్రం కదిలిందని, త్వరలో కొండను కదిలిస్తామని అన్నారు.