హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): ‘వికారాబాద్ రోడ్డు పనులు రెండేండ్లుగా ఆపిందెవరు? ఇంతమంది చావులకు కారణం ఎవరు? పనులు చేపట్టకుండా కాలయాపన చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలు పోవడానికి కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యమే కారణం కాదా?’ అని బీఆర్ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి పీ కార్తీక్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఐరన్‌లెగ్ సీఎం రేవంత్‌రెడ్డి వల్లే ఇలాంటి వైపరీత్యాలు చోటుచేసుకుంటున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు రోడ్డు పనులను ప్రా రంభించి ఉంటే మీర్జాగూడ రోడ్డు ప్రమాదం జరిగి 19 మంది ప్రాణాలు కోల్పోయే వారేకాదని చెప్పారు. హైదరాబాద్ తెలంగాణభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజాపూర్ జాతీయ రహదారి 2021లో మంజూరైతే మర్రిచెట్లను కాపాడాలని కొందరు ఎన్జీటీని ఆశ్రయించారని గుర్తుచేశారు.
ఎన్జీటీ నుంచి స్టే ఉపసంహరించే ప్రయత్నం చేయాలని రెండేండ్ల్లుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ నివేదిక ఇవ్వకపోగా టైంపాస్ చేశారని, ఎన్జీటీకి సరైన ప్రతిపాదనలను పంపించి ఉంటే పనులు ఎప్పుడో ప్రారంభమయ్యేవని చెప్పారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబసభ్యులు తీరనిశోకంతో ఒకవైపు రోదిస్తుంటే, మరోవైపు కనీస ఇంగితజ్ఞానం లేకుండా ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాజకీయాలు మాట్లాడారని మండిపడ్డారు. బీఆర్ఎస్ను విమర్శిస్తున్న ఆయన ఈ రెండేంండ్లు ఎంపీగా ఉండి ఏంచేశారని ప్రశ్నించారు. పనులు ప్రారంభమయ్యాయని మంత్రి కోమటిరెడ్డి అసెంబ్లీలో చెప్పారని, కానీ, నేటికీ పనులు ప్రారంభంకాలేదని స్పష్టంచేశారు. మృతుల కుటుంబసభ్యులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
మానవత్వం లేని సర్కార్: మెతుకు ఆనంద్
సీఎంకు జూబ్లీహిల్స్ ఎన్నికపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపైన లేదని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ విమర్శించారు. బస్సు ప్రమాద మృతులను టోయింగ్ వాహనంలో తీసుకెళ్తారా? అసలు ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉన్నదా? అని మండిపడ్డారు. గతంలోనూ ట్రాక్టర్లు, తోపుడు బండ్లపై మృతదేహాలను తరలించారని ఆవేదన వ్యక్తంచేశారు. రోడ్లు బాగాలేక వికారాబాద్ నియోజకవర్గానికి పిల్లను ఇవ్వడం లేదన్న స్పీకర్.. రెండేండ్లుగా ఏం చేస్తున్నారని విమర్శించారు. వికారాబాద్ రైల్వేబ్రిడ్జి పనుల్లో నేటికీ పిల్లర్లు పూర్తికాలేదని, బీఆర్ఎస్కు పేరు వస్తదని పనులు ఆపుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం, ఇతర కాంగ్రెస్ నేతలు వీధి రౌడీ, గూండాల తరహా భాష మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కుటుంబాలను పరామర్శించరా?: రోహిత్‌రెడ్డి
మీర్జాగూడ బస్సు ప్రమాదంలో తాండూరుకు చెందిన 12 మంది చనిపోవడం బాధాకరమని, ఘటన జరిగి రెండు రోజులవుతున్నా కాంగ్రెస్ నేతలెవరూ బాధిత కుటుంబాలను పరామర్శించలేదని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి విమర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి పిచ్చి పీక్ స్టేజ్‌కు వెళ్లిందని, అందుకే అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
వికారాబాద్ జాతీయ రహదారి రోడ్డు
పనులను వెంటనే మొదలుపెట్టకపోతే తాండూరు, వికారాబాద్ నుంచి పాదయాత్రగా వెళ్లి సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
50 లక్షల పరిహారం ఇవ్వాలి: శుభప్రద్‌పటేల్
మీర్జాగూడ బస్సు ప్రమాదంలో చనిపోయిన 19 మంది మృతుల కుటుంబసభ్యులకు రూ.50 లక్షల చొప్పన నష్టపరిహారం చెల్లించాలని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వికారాబాద్-హైదరాబాద్ హైవేపై ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయని, ఏటా వందలాది మంది చనిపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని విమర్శించారు. తక్షణమే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగేందర్, కౌశిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.