హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : రుతుపవనాలు బలపడుతుండటంతో రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. తెలంగాణ, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో వర్షం కురిసే సమయంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. తెలంగాణతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
బంగాళాఖాతంలోని ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో శుక్రవారం అక్కడక్కడ ఉరుములు మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం కూడా ఆదిలాబాద్, కుమ్రంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్-భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడవచ్చని అంచనా వేసింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
గడిచిన 24 గంటల్లో నిర్మల్ జిల్లా నిర్మల్ మండల కేంద్రంలో అత్యధికంగా 2.82 సెం.మీ వర్షపాతం నమోదైంది. నిర్మల్ రూరల్‌లో 1.93 సెం.మీ, సారంగపూర్‌లో 1.02 సెం.మీ, ఆదిలాబాద్ జిల్లా సత్నాలలో 1.33 సెం.మీ, ఇచ్చోడలో 1.02 సెం.మీ, నిజామాబాద్ జిల్లా నవీపేటలో 1.32 సెం.మీ, మెండోరాలో 1.01 సెం.మీ, నిజామాబాద్ సౌత్‌లో 0.98 మి.మి చొప్పున వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు పదిరోజుల ముందే ప్రవేశించినప్పటికీ, ఆరంభంలోనే భారీ వర్షాలు కురుస్తాయని ఆశపడ్డ రైతులకు నిరాశే ఎదురైంది. మే నెల చివర్లోనే కొన్ని జిల్లాల్లో వర్షం కురవడంతో జూన్ మొదటి వారంలోనే పొలాల్లో విత్తనాలు వేసేందుకు ముందుకొచ్చారు. కానీ, ఆ తర్వాత వర్షాలు కనుమరుగయ్యాయి. వానలు పడకపోవడంతో పొలాల్లో మొలకెత్తిన విత్తనాలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.