హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : ‘రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువనా?’ అన్నట్టున్నది రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వ వ్యవహారం. అసలే రేవంత్‌రెడ్డి (Revanth Reddy)! ఆపై ముఖ్యమంత్రి! ఇప్పుడాయన చిన్ననాటి కోరికలన్నింటినీ తీర్చుకోడానికి తెలంగాణ సొత్తును, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇష్టారాజ్యంగా వాడేస్తున్నాడు. ఈ నెల 13న హైదరాబాద్‌లో జరిగే ఫుట్‌బాల్ ఎగ్జిబిషన్ మ్యాచే (Football Exhibition Match) ఇందుకు ప్రస్ఫుటమైన ఉదాహరణ! ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజాల్లో ఒకరైన లియోనిల్ మెస్సీ వస్తున్నాడని, రెండు గంటలపాటు హైదరాబాద్‌లో ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఇందుకు ఏర్పాట్ల కోసమే ఏకంగా రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. పైగా దేశంలోనే అత్యుత్తమ పది క్రికెట్ గ్రౌండ్లలో ఒకటైన ఉప్పల్ స్టేడియానికి తూట్లు పొడుస్తున్నారు. మెస్సీ రాక.. ఫుట్‌బాల్ ఆట ద్వారా రాష్ర్టానికి రూపా యి ప్రయోజనం లేకున్నా కేవలం తనకు నచ్చి న ఆటను రాష్ట్రం నెత్తిన రుద్దాలని రేవంత్ భా విస్తున్నారని, అందుకే మెస్సీని తీసుకొస్తున్నాడని క్రీడాకారులు మండిపడుతున్నారు.
ఫుట్‌బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ అనేది పూర్తిస్థాయిలో ప్రైవేట్ కార్యక్రమం. మెస్సీని భారత్‌కు రప్పిస్తున్నది బెంగాల్‌కు చెందిన ఈవెంట్ మే నేజ్మెంట్ సంస్థ ప్రతినిధులు. ఢిల్లీ, ముంబై, కలకత్తాకు మెస్సీ వస్తున్నాడు. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కేరళకు వెళ్లాల్సి ఉండె. కానీ, కేరళ ప్రభుత్వం, స్థానిక స్పాన్స ర్లు చివరి నిమిషంలో తమకు ఆసక్తి లేదని చెప్పడంతో అక్కడ జరగాల్సిన ఫుట్‌బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ రద్దయ్యింది. ఇదే సమయంలో ఓ కార్యక్రమానికి ముంబై వెళ్లిన రేవంత్‌కు అక్కడ ఓ కీలక వ్యక్తి ‘మెస్సీ ఇండియాకు వస్తున్నాడు.. కేరళలో ఆయన ప్రోగ్రాం రద్దయ్యే అవకాశం ఉన్నది. మీరు పెడితే బాగుంటుంది’ అని చెప్పి బెంగాల్‌లోని ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను పరిచయం చేశాడు. ఆ మేనేజ్మెంట్ సంస్థ కేరళలో రద్దయ్యే ఆటకు అనుకోకుండా రేవంత్‌రెడ్డి ముందుకు రావడంతో ఎగిరి గంతేసి ఒప్పుకొన్నది.
భారత్‌కు మెస్సీ రావడం మూడు నెలల క్రితమే ఫిక్స్ అయితే తెలంగాణకు రావడం మాత్రం మూడు వారాల కిందటే నిర్ణయమైం ది. తెలంగాణకు, పుట్‌బాల్‌కు పెద్దగా సంబం ధం లేదు. మన రాష్ట్రంలో ఆ ఆటను చాలా తక్కువ మంది ఆడుతారు. క్రీడలను ప్రోత్సాహించేందుకు అనుకుంటే అత్యంత జనాదరణ ఉండే క్రికెట్, జాతీయ క్రీడ హాకీ వంటివాటి ప్రమోషన్‌ను చేపట్టాలి. మొదటి నుంచీ రేవంత్‌కు ఫుట్‌బాల్‌పై మక్కువ ఉన్నట్టు సన్నిహితులు చెప్తుంటారు. తనకు నచ్చిన క్రీడను రాష్ట్రం నెత్తిపై రుద్దాలని సీఎం భావిస్తున్నారని, అందుకే మెస్సీని తీసుకొస్తున్నాడన్న కీడ్రాకారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మెస్సీ హైదరాబాద్‌కు రావడం ఖరారు కాగానే స్వయంగా సీఎం ప్రకటన చేశారు. ఆయనే ఓ ఫుట్‌బాల్ జెర్సీ, ఫుట్‌బాల్ షూస్ వేసుకొని ఆట ప్రాక్టీస్ మొదలు పెట్టారు. దీంతో అధికారులు ఆయన ఇంటికి సమీపంలోనే, మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఓ ఫుట్‌బాల్ గ్రౌండ్ సిద్ధం చేశారు. రాత్రికి రాత్రే టర్ఫ్ వేశారు. దీనికి రూ.5 కోట్లు ఖర్చు చేశారు. ఫ్లడ్‌లైట్లు కూడా ఏర్పాటు చేశారు. ఆ ఫుట్‌బాల్ గ్రౌండ్లో ఇతరులు ఆడకుండా ప్రత్యేక సెక్యూరిటీతో బందోబస్తు కల్పించారు. సీఎం కోసం ప్రత్యేకంగా స్పైక్స్ ఉండే ఫుట్‌బాల్ షూస్ తెప్పించారు. సీఎంతోపాటు ఆయన చుట్టూ ఉండేవారు కూడా ఇదే అదనుగా అదే ఖాతాలో తెప్పించేసుకున్నారు.
దేశస్థాయిలో మెస్సీ పర్యటనకు జేఎస్‌డబ్ల్యూ, అదానీతో సహా అనేక కంపెనీలు స్పా న్సర్లుగా ఉండేందుకు ముందుకు వచ్చాయి. మెస్సీ మన దేశానికి వచ్చి ఇక్కడ ఫుట్‌బాల్ ఆడేందుకు రూ.వంద నుంచి 150 కోట్లు వ సూలు చేస్తున్నారు. భోజన వసతి ఏర్పాట్లకు ఆయా రాష్ర్టాల్లో స్థానిక స్పాన్సర్లను కోల్‌కతాకు చెందిన ప్రధాన ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ ఎంపిక చేసింది. మన రాష్ర్టానికి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వమే స్పాన్సర్ చేయాలని నిర్ణయించుకున్నది. ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు ఖర్చు చేస్తున్నది. ఇప్పటి వరకు ఒక్క మెస్సీకే 70 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది. సింగరేణి, పర్యాటక, క్రీడల శాఖల నుంచి ఈ నిధులను మెస్సీ టూర్‌కు మళ్లించినట్టు సమాచారం. రాష్ట్రంలోని ఓ అతిపెద్ద ఇంజినీరింగ్ కంపెనీ, మరో ఇన్ఫ్రా, రియల్ఎస్టేట్ కంపెనీలతో కూడా స్పాన్సర్ చేయిస్తున్నారు. మెస్సీకి ఇచ్చే మొత్తంతోపాటు ఆయన వ్యక్తిగత భద్రత సిబ్బందికి వసతి, విమాన ఖర్చులను ప్రభుత్వమే భరిస్తున్నది. అంతా కలిపి రూ.వంద కోట్లకుపైగా ప్రభుత్వం నుంచే వెళ్లనున్నది.
ఇంత చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఉపయోగంలేదు. మెస్సీ ఇక్కడ ఆడే ఎగ్జిబిషన్ మ్యాచ్‌కు సంబంధించిన సొమ్ము మొత్తం కోల్‌కతాలోని ప్రధాన ఈవెంట్ కంపెనీకి వెళ్తుంది. ఆ కంపెనీ ఉప్పల్ స్టేడియంలో 35 వేల టికెట్లు అమ్ముకుంటున్నది. ఒక్కో టికెట్ ధర రూ.పదివేలకు పైగానే పలుకుతున్నది. గరిష్ఠ టికెట్ ధర రూ.30 వేల దాకా ఉన్నది. ఇక స్టేడియంలో కోల్‌కతా ఈవెంట్ సంస్థ స్పాన్సర్లకు హోర్డింగ్‌లు, డిస్ప్లే బోర్డులు అమ్ముకుంటున్నది. ఆ ఆదాయం కూడా వాళ్లకే వెళ్తుంది. దీంతోపాటు మెస్సీతో ఫొటో దిగాలంటే ఒక్కో ఫొటోకు రూ.9 లక్షల 97 వేలుగా ధర నిర్ణయించింది. దీనికి అదనంగా జీఎస్టీ కూడా పెట్టింది. అంటే మెస్సీతో ఫొటో దిగేవారు రూ.12 లక్షల దాకా చెల్లించుకోవాల్సి ఉంటుం ది. ఫొటోతో పాటు మెస్సీ సంతకం చేసిన టీ షర్ట్ కూడా అందజేస్తారు. ఇలా మొత్తం 150 మందితో మెస్సీ హైదరాబాద్‌లో ఫొటోలు దిగనున్నారు. ఈ మొత్తం సొమ్ము ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకే చెందుతాయి. ఇలా తక్కువలో తక్కువగా రూ.15 కోట్లు వస్తాయి.
మెస్సీ రాక కోసం రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో కూడా ఒక ఈవెంట్ సంస్థను గుర్తించారు. రాష్ట్రంలో గతంలో ఐటీ శాఖలో కీలకంగా వ్యవహరించిన ఓ అధికారికి అత్యంత సన్నిహితంగా ఉండే సంస్థకే ఇప్పుడు కూడా ఈవెంట్ రైట్స్ ఇచ్చారు. సాంస్కృతిక శాఖతో సహా అనేక విభాగాలున్నా ఈ సంస్థకే ఈవెంట్ మేనేజ్మెంట్ బాధ్యతలు అప్పగించారు.
రాష్ట్ర ప్రభుత్వం సోమ, మంగళవారాల్లో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు, మెస్సీ రాకకు ఏమాత్రం సంబంధంలేదు. కానీ, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు మాత్రం తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు మెస్సీ వస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. మూడువారాల క్రితం వరకు అసలు మెస్సీ హైదరాబాద్ టూర్ లేదు. మెస్సీకి హైదరాబాద్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్నదన్న సమాచారం కూడా తెలియదు. కానీ, ఆదివారం భట్టి విక్రమార్క ఉప్పల్ స్టేడియంలో ఫుట్‌బాల్ మ్యాచ్ ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం మీడియా తో మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు మెస్సీ ఆసక్తి చూపుతున్నారంటూ మాట్లాడి అభాసుపాలయ్యారు. సోమ, మంగళవారాల్లో రైజింగ్ కార్యక్రమం జరుగుతుండగా మెస్సీ వస్తున్నది శనివారం. ఈ రెండింటికీ ముడిపెట్టేందుకు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు ప్రయత్నించారు.
రాష్ట్ర ప్రభుత్వంలో షాడో సీఎంగా చె లామణి అవుతున్న ఖైరతాబాద్నేతకే ఫుట్‌బాల్ టోర్నమెంట్ బాధ్యతలు అప్పగించారు. ఇది అనధికారిక బాధ్యత మాత్రమే కానీ, ఆయనే సర్వాధికారిగా వ్యవహరిస్తూ ఇ ప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రభుత్వ నిధులు ఖర్చు చేయడం.. ప్రైవేటు స్పాన్సర్ల వద్ద డీల్ మాట్లాడటం ఈయన బాధ్యత. సినిమా ఈవెంట్లలో మధ్యవర్తిగా వ్యవహరించే ఈ నేత ఎంత చెప్తే ఇప్పుడు అంత అన్నట్టుగా నడుస్తున్నది.
మెస్సీతో మ్యాచ్‌ను ఈనెల 13న ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. దేశం లోని అత్యుత్తమ పది క్రికెట్ గ్రౌండ్లలో ఉప్పల్ గ్రౌండ్ ఒకటి. ఇది టెస్టు క్రికెట్ గ్రౌండ్ కూడా. ఐసీసీ, బీసీసీఐ గ్రౌండ్‌ను పర్యవేక్షిస్తుంటాయి. ఇప్పుడీ గ్రౌండ్‌ను ఫు ట్‌బాల్ గ్రౌండ్లా మార్చేస్తున్నారు. ఆల్రెడీ ఉన్న క్రికెట్ గ్రౌండ్పైనే తాము ఫుట్‌బాల్ గ్రౌండ్ తయారు చేస్తున్నామని నిర్వాహకులు చెప్తున్నారు. కానీ, ఫుట్‌బాల్ గ్రౌండ్ కోసం మార్పులు చేసినప్పుడు క్రికెట్ పిచ్ మొత్తం దెబ్బతింటుంది. క్రికెట్ మ్యాచ్‌లు లేనప్పుడు పిచ్‌పై కనీసం బూట్లతో కూడా నడవవద్దన్నది బీసీసీఐ, ఐసీసీ నిబంధన.
అలాంటిది ఇప్పుడు ఫుట్‌బాల్ టర్ఫ్ వేయడంతోపాటు గ్రౌండ్లో స్పైక్స్ ఉన్న బూట్ల తో నడవడమే కాకుండా ఫుట్‌బాల్ ఆడనున్నారు. దీంతో ఈ స్టేడియంలో ఉన్న గ్రౌండ్ పూర్తిగా దెబ్బతింటుందని క్రికెట్ అభిమానులు, క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న గ్రౌండ్‌ను ఫుట్‌బాల్ గ్రౌండ్‌గా మార్చేందుకు, ఆ తర్వాత మళ్లీ ఫుట్‌బాల్ గ్రౌండ్‌ను క్రికెట్ గ్రౌండ్‌గా మార్చేందుకు రూ.10 కోట్లకు పైగానే ఖర్చవుతాయని చెప్తున్నారు. అంటే ఇదో వృథా ఖర్చు. ప్రభుత్వం కావాలనుకుంటే ఫుట్‌బాల్ కోసం ఇంకో స్టేడియాన్ని నిర్మించాల్సిందని క్రీడా ప్రేమికులు చెప్తున్నారు. శాశ్వతంగా నగరానికి ఇంకో గ్రౌండ్ ఉండిపోయేదని పేర్కొంటున్నారు.