TGSRTC | హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీని, ఆ సంస్థ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలనేది ఆర్టీసీ ఉద్యోగుల ఎన్నో ఏండ్ల కల. ఆ కలను బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ సాకారం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను స్వయంగా విన్నారు. అసెంబ్లీలో బిల్లు పెట్టారు, ఉభయ సభల్లో ఆ బిల్లును పాస్ చేయించి, గవర్నర్ వద్దకు పంపారు. నాటి గవర్నర్ ప్రభుత్వం పంపిన బిల్లును ఆమోదించకపోతే.. ఆర్టీసీ యాజమాన్యాన్ని రాజ్‌భవన్‌కు పంపి ఆ బిల్లుకు ఆమోదం తెలిపేలా విశేష కృషి చేశారు. నాటి ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు, కార్మికులకు చేయాల్సిందంతా చేసింది. ఆఖరికి అపాయింమెంటెడ్ డే కూడా ప్రకటించింది. అయితే, ఎన్నికల కోడ్ రావడంతో నిలిచిపోయిన ఆ ప్రక్రియ ఇప్పటికీ అలాగే ఉంది. ఇదే విషయంలో నాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ, ముఖ్యమంత్రి అయ్యాక అటు పుల్ల ఇటు తీసి వేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే మహాలక్ష్మి పథకాన్ని ఆర్భాటంగా తీసుకొచ్చి, ఆర్టీసీకి సకాలంలో నిధులు మంజూరు చేయకుండా నిట్టనిలువునా బొందపెట్టే ప్రయత్నం చేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు.
నెలనెలా రూ.450-500 కోట్లు అవసరం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17నెలలవుతున్నా ఆర్టీసీ కార్మికుల విలీన ప్రక్రియలో ఎలాంటి చలనం లేదు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్వయంగా సీఎం చెప్పడంతోపాటు.. అప్పులిచ్చేందుకు ఎవరూ ముందుకురావడం లేదని వాపోతున్నారు. మొత్తానికి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకునే మార్గాలు తెలియకపోవడం తో ఆర్టీసీ కార్మికుల విలీనం దాదాపుగా ఆగిపోయింది. దీంతో కార్మిక సంఘాల నేతలు ఆరు నెలల నుంచి ప్రభుత్వ పెద్దలకు, మంత్రులకు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపానపోలేదు. దీంతో వారు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పునరాలోచనలో పడిన ప్రభుత్వం.. ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తే ప్రభుత్వంపైపడే అదనపు భారాన్ని చూసి అవాక్కయిందట. ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే.. వారికి అపాయింటెడ్ డే ప్రకటిస్తే.. ఆనెల నుంచి ప్రతినెలా అదనంగా రూ.450 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకూ నిధులు అవసరం అవుతాయని సమాచారం. ఆర్టీసీ నుంచి వచ్చే ఆదాయం ప్రతినెలా రూ.300 కోట్లకు కూడా మించకపోవడం, మహాలక్ష్మి ఉచిత ప్రయా ణం కింద సుమారు రూ.300 కోట్ల వరకు ఆర్టీసీ ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తుండటంతో ఈ అంశాన్ని వదిలేద్దామనే ధోరణిలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారని తెలిసింది.
జీతాలకేనెలకు రూ .170 కోట్లు..
ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల నెల వేతనానికి ప్రస్తుతం రూ.170 కోట్లకు పైగా నిధులు అవసరం. దాదాపు రూ.85 కోట్ల వరకు లోన్లకు.. రూ.8కోట్ల వరకు డీజిల్‌కే పోతున్నాయి. ఇక ఉద్యోగుల పీఎఫ్, సీసీఎస్‌లకు మరో రూ.40 కోట్ల వరకు అవసరం అవుతున్నాయి. ఇతర మెయింటెనెన్స్ ఖర్చులు కలిపితే.. ఆర్టీసీకి ఆదాయం కంటే నష్టమే వస్తున్నట్టు పలువురు చెబుతున్నారు. అదే సమయంలో ‘మహాలక్ష్మి ఉచిత ప్రయాణం’ కింద ప్రభుత్వం నుం చి నెలనెలా రావాల్సిన రూ.300 కోట్లు సకాలంలో అందకపోవడంతో ఆర్టీసీ యా జమాన్యం నానా తంటాలు పడుతున్నది. నాడు ఆర్టీసీ నుంచి వచ్చే ఆదాయాన్ని బేరీజు వేసుకున్న కేసీఆర్.. ఆర్టీసీ ఉద్యోగులను, కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసినా ఎలాంటి నష్టం ఉండబోదని నిపుణులతో చర్చించిన తర్వాతే నిర్ణయం ప్రకటించారు. ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వాల్సిన ‘మహాలక్ష్మి’ బకాయిలు పేరుకుపోయాయి. దీంతో నెలాఖరు వస్తే చాలు ప్రభుత్వాన్ని అడుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇట్లాంటి దారుణ పరిస్థితులు ఉండటంతో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం ఈ ఏడాది కూడా పూర్తవ్వదని విశ్వసనీయ సమాచారం.