హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): మానసిక ఒత్తిడి, పని ప్రదేశాల్లో వేధింపులు యువ వైద్యుల ప్రాణాలు తీస్తున్నాయి. ఈ సమస్యలకు తాళలేక గత నెల నుంచి ఇప్పటివరకు ఏడుగురు యువ వైద్యులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో తెలుగు రాష్ర్టాలకు చెందిన ఐదుగురితోపాటు ఛత్తీస్గడ్, మహారాష్ట్రకు చెందిన ఇద్దరు ఉన్నారు. ఇలా గత ఐదేండ్లలో దేశవ్యాప్తంగా 119 మంది వైద్యులు చనిపోయినట్టు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) మే నెలలో వెల్లడించింది. ప్రస్తుతం మన రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో పనిచేస్తున్న ట్రైనీ డాక్టర్లకు నిర్దిష్ట పని వేళలు, వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు సరైన వ్యవస్థ లేకపోవడం వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. దీంతో వైద్యుల ఆత్మహత్యలను నివారించేందుకు వెల్నెస్ సెంటర్లు, మానసిక చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయాలని వైద్య రంగ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికిపైగా మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇటీవల వెల్లడించింది. మానసిక ఒత్తిడితో 2021లోనే 7,27,000 మంది ఆత్మహత్యలకు పాల్పడినట్టు తెలిపింది. ఇలాంటి బలవన్మరణాలను నిరోధించేందుకు కట్టుదిట్టమైన విధానాలను రూపొందించడంతోపాటు మానసిక ఆరోగ్య సేవలకు భారీగా నిధులు కేటాయించాలని, మెంటల్ హెల్త్ వర్క్‌ఫోర్స్‌ను నియమించుకోవాలని ప్రపంచ దేశాలకు సూచించింది. ప్రస్తుతం పలు దేశాల్లో ప్రభుత్వాలు తమ ప్రజారోగ్య బడ్జెట్లో ప్రజల మానసిక ఆరోగ్య పరిరక్షణకు కనీసం 2% నిధులు కూడా కేటాయించడం లేదని ‘మెంటల్ హెల్త్ అట్లాస్-2024’ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.
యువ వైద్యులకు సరైన నిద్ర లేకపోవడం, రోజూ ఏకధాటిగా 18-20 గంటలు పనిచేయడం వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఫ్యాకల్టీ అవమానించడంతో వైద్య విద్యార్థుల ఆత్మవిశ్వాసం దెబ్బతింటున్నది. చాలా మెడికల్ కాలేజీల్లో సైకలాజికల్ కౌన్సెలింగ్ సదుపాయం లేదు. విద్యావ్యయాలు అధికమవడం, ఆర్థిక ఒత్తిడి, భవిష్యత్తుపై అనిశ్చితి వైద్య విద్యార్థుల ప్రాణాలను హరిస్తున్నాయి. దీన్ని నివారించేందుకు మెడికల్ కాలేజీల్లో మెంటల్ హెల్త్ సెల్స్, వెల్బీయింగ్ సెల్స్‌ను ఏర్పాటు చేయడంతోపాటు వైద్యుల కోసం వెంటనే జాతీయ హెల్ప్ లైన్‌ను ప్రారంభించాలి.
– ప్రొఫెసర్ విశాల్ ఆకుల, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ నేషనల్ డైరెక్ట్ కౌన్సిల్ మెంబర్