హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్ (జీఐసీ) పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు ఎల్లలు దాటాయి. జీఐసీ తన 8వ వార్షికోత్సవాన్ని బెంగాల్‌లోని సుందర్బన్స్ మడ అడవుల సంరక్షణ కార్యక్రమంతో ఘనంగా జరుపుకొన్నది. 2018లో మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ స్థాపించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ దేశవ్యాప్తంగా కోట్లాది మొకలు నాటే ఉద్యమంగా విస్తరించింది. భారతదేశాన్ని హరితమయంగా మార్చే సామూహిక సంకల్పంలో పాలుపంచుకున్నది. సుందర్బన్స్ డ్రైవ్‌ను ‘బెంగాల్ మడ మనిషి’గా పేరొందిన ఉమాశంకర్ మండల్‌తో గ్రీన్ చాలెంజ్‌ను ప్రారంభించారు. పుర్బాషా ఎకో హెల్ప్‌లైన్ సొసైటీ, ఇగ్నైటింగ్ మైండ్స్ సహకారంతో ఆదివారం గోసాబా ప్రాంతంలో 2వేల మడ మొకలు నాటారు. పుర్బాషా ఎకో హెల్ప్ లైన్ సొసైటీ అధ్యక్షుడు దీపాంకర్ మండల్, జనరల్ సెక్రటరీ ఉమాశంకర్మండల్ నేతృత్వంలో దాదాపు 20 ఏండ్లుగా సుందర్బన్స్లో క్షీణించిన తీరప్రాంతాన్ని వేలాది ఎకరాల్లో పునరుద్ధరించారు. జీఐసీ సహ వ్యవస్థాపకుడు రాఘవేందర్ సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్తలు ఆశిష్‌కుమార్ పాల్, ముఖోపాధ్యాయ్, రామకృష్ణ శారదా పీఠం విద్యార్థులు, జియో ఇంజినీరింగ్ సాలర్లు, 500 మంది హరిత సేన సభ్యులు, 10 మంది ఇన్ఫోసిస్ ప్రతినిధులు భాగస్వాములయ్యారు.