హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా రక్తదానం చేసిన పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ అభినందించారు. ‘సీఎం కేసీఆర్ జన్మదినాన్ని రక్త బంధంతో పెనవేశారు. మీ సేవ అనిర్వచనీయం. మీ లాంటి నిస్వార్థ సేవాతత్పరుల వల్ల మరింత మందికి సేవలు అందించే భాగ్యం కలుగుతుంది’ అని ప్రశంసిస్తూ చిరంజీవి, రామ్ చరణ్ స్వయంగా సంతకం చేసిన లేఖను పంపారు. ఈ రక్త బంధాన్ని మరిన్ని ఏండ్లపాటు కొనసాగిస్తూ మానవాళికి సేవ చేయాలని చిరంజీవి ఆకాంక్షించారు. మరోవైపు కేసీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ ఏపీ శాఖ రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించింది.