హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన శాంతికుమారికి టాలీవుడ్ హీరో, మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేశారు. శాంతికుమారి చిత్తశుద్ధి తెలంగాణ అభివృద్ధికి దోహదపడుతుందని మెగాస్టార్ తన ట్వీట్లో పేర్కొన్నారు. తెలంగాణకు తొలి మహిళా సీఎస్‌గా శాంతికుమారి నియామకం కావడం సంతోషంగా ఉందని చిరంజీవి తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి శాంతికుమారి నియమితులైన సంగతి తెలిసిందే. మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ రిలీవ్ అయిన నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శాంతికుమారిని కొత్త సీఎస్‌గా నియమించింది. ఈ మేరకు జీఏడీ కార్యదర్శి వీ శేషాద్రి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెనువెంటనే సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన శాంతికుమారి తన పేరుపై పలు రికార్డులను లిఖించుకున్నారు.
తెలంగాణ తొలి మహిళా సీఎస్‌గా నిలిచారు. ఉమ్మడి ఏపీ మొదలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ర్టాల్లో సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. తనకు అప్పగించిన ప్రతి పనిని సమర్థవంతంగా పూర్తి చేస్తారని, ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తారని శాంతికుమారికి మంచి పేరున్నది. తెలంగాణ రాష్ర్టావిర్భావం తర్వాత ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించిన టీఎస్ఐపాస్ అమలులో శాంతికుమారి కీలక పాత్ర పోషించారు.
Madam Shanthi kumari garu, Hearty Congrats on your elevation as @TelanganaCS ! Delighted that you will be the first woman to adorn this position as Top Bureaucrat of the state. Trust your commitment will help all round development of Telangana & bring many accolades to you! 🙏 💐
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 12, 2023