హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్, బీజేపీ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని, ఆ పార్టీలు తెలంగాణకు చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ నేతలకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. సోమవారం నందినగర్‌లోని తన నివాసంలో ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లా నేతలతో ఆయన విడివిడిగా సమావేశమై కాంగ్రెస్ హామీలపై నిలదీద్దామని చెప్పారు. ఈ సందర్భంగా వారు నాగార్జునసాగర్ ఆయకట్టు కింద రైతులు పడుతున్న ఇబ్బందులను కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం రైతులకు విద్యుత్తు కూడా ఇవ్వలేకపోతున్నదని, బోర్ల కింద పంటలు వేసుకుంటున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదురయ్యేట్టు ఉన్నదని, ప్రభుత్వం సాగునీళ్లు, కరెంటు ఇవ్వటంలో పూర్తిగా విఫలమైనదని వివరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ తెలంగాణ నాడు, నేడు ద్రోహమే చేసిందని, ఏనాడూ ఆ పార్టీ తెలంగాణ పక్షాన లేదని విమర్శించారు. పదేండ్లలో బీజేపీ రాష్ర్టానికి చేసిన మేలు ఒక్కటీ లేదని తెలిపారు. కేవలం మతాన్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకోవటమే ఆ పార్టీకి తెలిసిన విద్య అని మండిపడ్డారు. ఈ రెండు పార్టీలతో తెలంగాణకు, ప్రజలకు ఉపయోగం లేదని, కేంద్ర ప్రభుత్వంతో తలపడే విషయంలో, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే అంశంలో బీఆర్ఎస్ పార్టీనే ముందుంటుందని స్పష్టం చేశారు. తెలంగాణకు రక్ష బీఆర్ఎస్నే అని, బీఆర్ఎస్ పార్టీ పాలనలోనే ప్రజలు సుభిక్షంగా ఉన్నారని కేసీఆర్ గుర్తుచేశారు.
చేవెళ్ల నేతలతో సమావేశం
చేవెళ్ల లోక్‌సభ స్థానంపై సమావేశంలో ఎమ్మెల్యేలు సబిత, అరికపూడి గాంధీ, కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్, కొప్పుల మహేశ్వర్‌రెడ్డి, పైలట్ రోహిత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కాసాని, కార్తీక్‌రెడ్డి పాల్గొన్నా రు. అభ్యర్థి ఎంపికపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుందామని నేతలకు కేసీఆర్ తెలిపారు.
టికెట్లకు పోటాపోటీ
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసేందుకు నల్లగొండ స్థానానికి పలువురు ఆసక్తిచూపుతున్నట్టు పార్టీ జిల్లా నేతలు కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపురెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి, గుత్తా అమిత్ తదితరులు నల్లగొండ నుంచి పోటీచేసేందుకు గతంలో సుముఖత వ్యక్తం చేశారని, భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, క్యామ మల్లేశ్, జిట్టా బాలకృష్ణారెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి తదితరులు పోటీకి ఆసక్తి చూపుతున్నట్టు వెల్లడించారు. రెండు స్థానాలకు ఎవరు అభ్యర్థిగా ఉంటే బాగుంటుందో చర్చించుకొని రావాలని వారికి కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. ఒకట్రెండు రోజుల్లో అభ్యర్థి ఎవరనేది ప్రకటించుకుందామని చెప్పారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా సమావేశంలో ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, గాదరి కిశోర్, బొల్లం మల్లయ్యయాదవ్, భాస్కరరావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, సునీతా మహేందర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, రవీంద్రనాయక్, పార్టీ నేతలు చెరుకు సుధాకర్, నర్సింహారెడ్డి, పల్లా ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.