హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాంతీయ రింగు రోడ్డు (ట్రిపుల్ఆర్) పురోగతిపై మంగళవారం కీలక సమావేశం జరగనున్నది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) అధికారులు సచివాలయంలో ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ కానున్నారు. ట్రిపుల్ఆర్ యుటిలిటీ షిఫ్టింగ్, భూసేకరణతోపాటు టెండర్ల ప్రక్రియ, దక్షిణ భాగం రోడ్డు ప్రణాళికకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం నిర్మాణ పనుల కోసం ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఇందుకు అవసరమైన భూసేకరణలో ఇప్పటికే దాదాపు 90% వరకు పూర్తవడంతో ప్యాకేజీలవారీగా టెండర్లు పిలవాలని నిర్ణయించారు. కానీ, రాయగిరి ప్రాంతంలో భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరించడంతో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఉత్తర భాగం అలైన్మెంట్ను స్వల్పంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ అందుకు ఎన్హెచ్ఏఐ ఒప్పుకోలేదని తెలుస్తున్నది. ట్రిపుల్ఆర్ దక్షిణ భాగం పనులకు కూడా కేంద్రం ఇదివరకే అంగీకారం తెలపడంతో అలైన్మెంటు ఖరారు, నంబరు కేటాయింపునకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడాల్సి ఉన్నది.
ట్రిపుల్ ఆర్ పనులను ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలోనే చేపట్టాలని, తద్వారా భూసేకరణలో ఎదురవుతున్న సమస్యలను త్వరగా పరిష్కరించుకునేందుకు వీలవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో ట్రిపుల్ఆర్ పనులను చేపడితే స్థానికంగా ఏర్పడే సమస్యలపై నిర్ణయం తీసుకునేందు చాలా సమయం పడుతుందని, దీనివల్ల పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది. అందుకే మొత్తం ట్రిపుల్ఆర్ పనులను రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టేందుకు అనుమతివ్వాలని కోరుతున్నది. ఈ నేపథ్యంలో మంగళవారం జరగనున్న సమావేశం చాలా కీలకమైనదని అధికారులు అంటున్నారు.