హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) పనుల పురోగతిపై తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాలతో కేంద్ర జల్‌శక్తి శాఖ ప్రత్యేక సమావేశం సోమవారం ఢిల్లీలో నిర్వహించనున్నది. ఏఐబీపీ కింద మేజర్, మీడియం కలిపి మొత్తం తెలంగాణలో 11 ప్రాజెక్టులుండగా, అందులో ప్రస్తుతం కేవలం దేవాదుల, పెద్దవాగు, రాజీవ్‌భీమా, వరదకాలువ, ఎస్సారెస్పీ స్టేజ్2 ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. భూసేకరణ జాప్యం వల్ల ముందుకు సాగడం లేదు. అందుకు 140 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేయాలని గతంలోనే కేంద్రానికి తెలంగాణ ప్రతిపాదనలు పంపింది. తాజాగా ఆయా పనులకు సంబంధించి పురోగతి, కేంద్రం విడుదల చేసిన నిధుల వినియోగం అంశాలపై కేంద్రజల్‌శక్తిశాఖ సమీక్షించనున్నది.