హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ దూత మీనాక్షి నటరాజన్ చేపట్టిన తొలివిడత పాదయాత్ర ముగిసింది. ఐదు ఉమ్మడి జిల్లాల్లో ఐదు రోజులపాటు సాగిన ఈ పాదయాత్రలో ఆమె ఎక్కడా సీఎం రేవంత్‌రెడ్డి పేరు మాట వరుసకైనా ప్రస్తావించలేదని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. ఏడాదిన్నర రేవంత్‌రెడ్డి పాలనపై రైతులు, కూలీలు, మహిళలు, వృద్ధులు తీవ్ర వ్యతిరేకతతో ఉండటం వల్లనే పాదయాత్రలో ఆమె రేవంత్‌రెడ్డి పేరు ఎత్తడానికి ఇష్టపడలేదని పార్టీ నాయకులు చెప్తున్నారు. రేవంత్ పేరు తీస్తే స్థానిక ఎన్నికల్లో తీవ్ర నష్టం జరుగుతుందనే భావనతో ఆమె ఉన్నట్టు తెలిసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సూచన మేరకే ఆమె సీఎం రేవంత్‌రెడ్డి పేరును ప్రస్తావించలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
వలస నేతలకే అందలం
కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్‌రెడ్డికి, పార్టీ హైకమాండ్‌కు మధ్య తీవ్ర అంతరం పెరిగినట్టు గ్రామస్థాయి కార్యకర్తల్లోనూ చర్చ జరుగుతున్నది. పాదయాత్రలో భాగంగా మీనాక్షి పలుచోట్ల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రభుత్వ, పార్టీ పదవుల్లో.. వలస వచ్చిన వారికే అన్ని అవకాశాలు ఇచ్చి అందలం ఎక్కిస్తున్నారని.. అసలు కాంగ్రెస్ నేతలను పట్టించుకోవటం లేదని కార్యకర్తలు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ ఫిర్యాదులపై పక్కనే ఉన్న పీసీసీ అధ్యక్షడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను సమాధానం చెప్పాలని ఆమె కోరినట్టు తెలిసింది. కొత్త, పాతతరం నేతల సమ్మేళనంతో నడిపిస్తున్నామని, 15శాతం వలస నేతలకు, 85శాతం అసలు నేతలకు పదవుల్లో అవకాశం కల్పిస్తున్నామని మహేశ్‌కుమార్‌గౌడ్ వివరించినట్టు తెలిసింది.
పార్టీ పదవుల్లో రేవంత్ వర్గమే..
క్షేత్రస్థాయిలో కార్యకర్తలు చేసిన ఫిర్యాదులతో అనుమానం వచ్చిన మీనాక్షి నటరాజన్ గత 18నెలల్లో పార్టీ పదవులు ఎంతమందికి ఇచ్చారు? ప్రభుత్వం పదవులు ఎంతమందికి ఇచ్చారు? వీరిలో అసలు కాంగ్రెస్ నేతలు ఎంతమంది? వలస నేతలు ఎందరున్నారనే వివరాలను తెప్పించుకొని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. తన ఐదు రోజుల పాదయాత్ర, పార్టీ కార్యకర్తలతో సమావేశాలకు సంబంధించిన పూర్తి వీడియో ఫుటేజీ తెప్పించుకొని పరిశీలిస్తారని అనంతరమే ఆమె అధిష్ఠానానికి ఒక నివేదిక ఇస్తారని సీనియర్ కాంగ్రెస్ నేత ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధికి వివరించారు.
జనం ఎందుకు రాలేదు..?
పాదయాత్రలకు ఊహించిన స్థాయిలో జనం రాలేదని, సభలలో కూడా పెద్దగా కనిపించలేదని మీనాక్షి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. పాదయాత్రకు ప్రజలు స్పందించకపోవడం ప్రభుత్వం మీద వ్యతిరేకత కారణంగానేనని ఆమె భావిస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పాదయాత్రకు పైసలు పంపినట్టు జోగిపేట వేదిక మీద ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు చెప్ప టం మైక్ ద్వారా బహిర్గతమైన విషయం తెలిసిందే. దీనిపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. డబ్బులు ఇచ్చినా పాదయాత్రకు జనం రావటం లేదని మీరు షో చేయదలుచుకున్నారా? లేక ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ప్రజలు పాదయాత్రకు దూరంగా ఉన్నారా? అని నిలదీసినట్టు పార్టీ క్యాడర్ చెప్తున్నది.