హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): అసలు రాష్ట్ర కాంగ్రెస్‌లో ఏం జరుగుతున్నది? తాజా పరిణామాలు ఏ సంకేతాలిస్తున్నాయి? రాష్ట్రంలో పరిస్థితిపై సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చే నివేదికలను, చెప్పే మాటలను పార్టీ అధిష్ఠానం విశ్వసించడం లేదా? అందుకే తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను రంగంలోకి దింపిందా? ఆమె పాదయాత్ర ఉద్దేశం ఏమిటి? ఆ నిర్ణయం వెనుక ఉన్నదెవరు? ఇదంతా రేవంత్‌రెడ్డికి చెక్ పెట్టేందుకేనా? ఆయనను డమ్మీ చేసేందుకా? త్వరలోనే పార్టీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయా? ఇవీ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంలో వెల్లువెత్తుతున్న అనుమానాలు, అభిప్రాయాల పరంపర! కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ రాష్ట్రంలో పాదయాత్ర చేయాలనే నిర్ణయం ఆ పార్టీలో సంచలనంగా మారింది.
దీనిపై పార్టీలో ఎడతెగని చర్చ నడుస్తున్నది. అసలు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందనే చర్చ జోరందుకున్నది. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని, ఒకవేళ పాదయాత్ర చేస్తే రాష్ట్ర నేతలు చేయాలి గాని ఇన్చార్జి చేయడమేమిటని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇన్చార్జి పాదయాత్ర ఎందుకని? తద్వారా ప్రజలకు ఏం సందేశమివ్వాలనుకుంటున్నారనే చర్చించుకుంటున్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో, లేని రాష్ర్టాల్లోనూ ఇన్చార్జి పాదయాత్ర చేసిన సందర్భం లేదని, ఇతర కీలక నేతలు పాదయాత్రలో పాల్గొనడమే తప్ప ప్రత్యేకంగా ఇన్‌చార్జిలే పాదయాత్ర చేసిన పరిస్థితులు లేవని గుర్తుచేస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క చేసిన పాదయాత్రలు చేశారని, అదికూడా వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేశారని చెప్తున్నారు. ఇప్పుడు పూర్తి విరుద్ధంగా పార్టీ అధికారంలో ఉన్నా ఇన్చార్జి పాదయాత్ర ఏమిటని విస్తుపోతున్నారు. ఈ వింతలు, విడ్డూరాలకు తెలంగాణనే వేదికైందా? అంటూ పార్టీ నేతలే అసహనం వ్యక్తంచేస్తున్నారు.
మీనాక్షి పాదయాత్ర నిర్ణయంపై కాంగ్రెస్ నేతల్లోనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రంగానే చర్చోపచర్చలు నడుస్తున్నాయి. మీనాక్షి పాదయాత్ర నిర్ణయానికి రేవంత్‌రెడ్డే కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్‌రెడ్డిని అధిష్ఠానం పెద్దలు నమ్మడం లేదని, రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పరిస్థితిపై ఆయన చెప్పే మాటలను, ఇచ్చే నివేదికలను విశ్వసించడం లేదని, వాస్తవాలను దాస్తూ తప్పుదోవ పట్టిస్తున్నాడనే అనుమానం పార్టీ పెద్దల్లో నెలకొన్నదని, అందుకే క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకునేందుకు అత్యంత నమ్మకమైన మీనాక్షి నటరాజన్‌ను రంగంలోకి దింపినట్టుగా చర్చ నడుస్తున్నది.
కులగణన, ఇటీవల ఢిల్లీలో సీఎం ప్రసంగంపై పార్టీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్టు గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తనను ప్రశంసిస్తూ లేఖ రాసినట్టు రేవంత్‌రెడ్డి అందరి ముందూ ప్రకటించుకున్నారు. తాను కులగణన ప్రారంభ సమావేశానికి హాజరుకాలేనని రాసిన ఉత్తరాన్ని ప్రశంస పత్రంగా చూపడంపై రాహుల్ గాంధీ ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది.
ఈ లేఖపైనే ఇంత బహిరంగంగా అబద్ధాలు చెప్పిన రేవంత్‌రెడ్డి ఇక రాష్ట్ర పరిస్థితిపై చెప్తున్న మాటలు, ఇస్తున్న నివేదికల్లో ఇంకెన్ని అబద్ధాలు ఉన్నాయోనని అనుమానం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. అందుకే రేవంత్‌కు చెక్‌పెట్టేలా మీనాక్షిని రంగంలోకి దింపి పాదయాత్ర ద్వారా క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఆమె ఇచ్చే కీలక నివేదిక తర్వాత రాష్ట్ర పార్టీలో, ప్రభుత్వంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నదనే చర్చ జరుగుతున్నది.
మీనాక్షి నటరాజన్ పాదయాత్ర నిర్ణయాన్ని పార్టీ నేతలే తప్పుపడుతున్నారు. అంతర్గత సమావేశాల్లో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇన్చార్జి పాదయాత్ర చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, జిల్లా ఇన్చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలను బుల్డోజ్ చేసేలా ఆమె నిర్ణయం ఉన్నదని, పాదయాత్రతో పార్టీకి ఏం లాభమని రగిలిపోతున్నారు. పాదయాత్రలో ప్రజలు ఆమెను గుర్తుపడతారా? అనీ ప్రశ్నిస్తున్నారు. అధికారం ఉన్న పార్టీ పాదయాత్ర చేయడమేమిటని పెదవివిరుస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ పాదయాత్ర చేస్తే ప్రజల్లో వ్యతిరేకత తప్పదనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ పాదయాత్రలో భాగంగా ప్రభుత్వ పథకాలపై ప్రజలు ప్రశ్నిస్తే పరిస్థితి ఏమిటని వాపోతున్నారు. ప్రభుత్వంలో ఉంటూ పాదయాత్రతో పరోక్షంగా సొంత ప్రభుత్వంపైనే యుద్ధం ప్రకటించారా? అనే చర్చ కూడా నడుస్తున్నది.
పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 31నుంచి ఆగస్టు 6 వరకు ఆమె తొలిదశ పాదయాత్ర చేయనున్నారు. ఆరు ఉమ్మడి జిల్లాల్లో ఎంపిక చేసిన ఆరు నియోజకవర్గాల్లో పాదయాత్రకు ప్రణాళిక రూపొందించారు. ఈనెల 31న రంగారెడ్డి జిల్లా పరిగి నియోజకవర్గంలో పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఆగస్టు 1న శ్రమదానం చేయడంతో పాటు పార్టీ వర్కర్స్‌తో సమావేశం కానున్నారు.
2న మెదక్ జిల్లా అందోల్ నియోజకవర్గం, 3న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం, 4న ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్, 5న కరీంనగర్ జిల్లా చొప్పదండి, 6న వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో పాదయాత్ర చేయనున్నారు. కాగా పాదయాత్ర నిర్వహణకు కాంగ్రెస్ అధిష్ఠానం సమన్వయ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో రేవంత్‌రెడ్డికి సబంధించిన వ్యక్తులు గాని, ఆయనకు సన్నిహితంగా ఉండేవారు గాని లేకపోవడం గమనార్హం.
సీఎం రేవంత్‌రెడ్డికి చెక్ పెట్టడమే మీనాక్షి పాదయాత్ర అసలు ఉద్దేశమనే అభిప్రాయాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాహుల్‌గాంధీకి, రేవంత్‌రెడ్డికి మధ్య దూరం పెరిగిందని, ఈ క్రమంలోనే రాహుల్ టీంలో కోర్మెంబర్ అయిన మీనాక్షిని తెలంగాణ ఇన్చార్జిగా నియమించి రేవంత్ మోనోపోలీకి చెక్ పెట్టారనే చర్చలు నడుస్తున్నాయి. ఇప్పుడు పాదయాత్ర కూడా చేయించడం ద్వారా రేవంత్‌ను డమ్మీ చేసి అధిష్ఠానం, పార్టీయే సుప్రీం అనే అభిప్రాయాన్ని నేతల్లో కల్పించాలనే ఉద్దేశంలో పార్టీ పెద్దలున్నట్టు తెలిసింది. వాస్తవానికి అధిష్ఠానం పెద్దల ఆదేశాల్లేకుండా మీనాక్షి పాదయాత్ర చేయరని, అధిష్ఠానమే వెనకుండి ఈ పాదయాత్ర చేయిస్తున్నదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పాదయాత్రలో భాగంగా ఆమె పార్టీ వర్కర్స్‌తో సమావేశం కానున్నారు.
ఆయా జిల్లాలు, నియోజకవర్గాల కీలక నేతలు, క్షేత్రస్థాయిలో కీలక కార్యకర్తలను నేరుగా టచ్‌లోకి తీసుకునేలా ప్రణాళిక వేసినట్టు తెలిసింది. తద్వారా క్షేత్రస్థాయి నేతలు, కార్యకర్తలకు పార్టీయే సుప్రీం.. ఆ తర్వాతే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలనే సంకేతాన్నివ్వాలనే యోచనలో అధిష్ఠానం ఉన్నట్టుగా తెలిసింది. పాదయాత్ర ద్వారా క్షేత్రస్థాయిలోని నేతలను, కార్యకర్తలను తమవైపు తిప్పుకోవడం ద్వారా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలను డమ్మీ చేయొచ్చనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ, ప్రభుత్వ పరిస్థితి ఏమిటనేది కూడా పాదయాత్ర ద్వారా తెలుసుకునేందుకు ప్లాన్ చేశారనే చర్చ నడుస్తున్నది.