మహదేవపూర్/కాళేశ్వరం/అయిజ, జూలై 13 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లిలోని మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. బరాజ్‌కు శుక్రవారం 43,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, శనివారం 41,200 క్యూసెక్కులకు తగ్గింది.
బరాజ్‌లోని మొత్తం 85 గేట్లు తెరిచి అంతే మొత్తంలో వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం రివర్బెడ్ నుంచి 1.50 మీటర్ల ఎత్తులో వరద ప్రవహిస్తున్నది. కాగా కాళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం తగ్గుతున్నది.
వారం రోజులుగా ప్రాణహిత నదికి వరద పెరిగినా, శనివారం సాయంత్రం వరకు తగ్గడంతో పుష్కరఘాట్ వద్ద 43 వేల క్యూసెక్కుల నుంచి 40 వేల క్యూసెక్కులకు తగ్గింది. ప్రస్తుతం 05.01 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న గోదావరి లక్ష్మీ బరాజ్ వైపు పరుగులు తీస్తున్నది.
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంలోకి వరద వచ్చి చేరుతున్నది. శనివారం ఇన్‌ఫ్లో 11,400 క్యూసెక్కులు ఉండగా.. అవుట్‌ఫ్లో 210 క్యూసెక్కులుగా నమోదైంది.
డ్యాం గరిష్ఠ నీటినిల్వ 105.855 టీఎంసీల సామర్థ్యానికి గాను ప్రస్తుతం 30.690 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులకుగాను 1606.21 అడుగులకు చేరినట్టు డ్యాం సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు.