హైదరాబాద్, జూలై26 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల వద్ద వరద ప్రవాహాలు తగ్గిన తర్వాతే పరీక్షలు చేపట్టే అవకాశం ఉంటుందని సెంట్రల్ పవర్ అండ్ వాటర్ రిసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) ఫుణె నిపుణుల బృందం తేల్చింది. ఈ మేరకు తెలంగాణ ఇంజినీర్లకు, ఏజెన్సీ ప్రతినిధులకు సూచించినట్టు తెలిసింది. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లతో పాటు మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇప్పటికే తుది నివేదికను సమర్పించింది. బరాజ్‌లపై సమగ్రమైన జియో టెక్నికల్ అధ్యయనాలు, అధునాతన నదీగర్భంలోని భౌగోళిక పరిస్థితుల అంచనాలు అవసరమని ఆ నివేదికలో వెల్లడించింది.
మేడిగడ్డ బరాజ్ దిగువన ఏర్పడిన ఖాళీ ప్రదేశాన్ని గ్రౌటింగ్ చేయడం వల్ల ప్రస్తుతం పరీక్షలు నిర్వహించినా కచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశమూ లేదని నివేదికల్లో తెలిపింది. ప్రముఖ కేంద్ర సంస్థలను సంప్రదించి పరీక్షలను జరిపించాలని ఎన్డీఎస్ఏ తన నివేదికలో సూచించింది. ఈ మేరకు ప్రాజెక్టు అధికారులు, నిర్మాణ ఏజెన్సీల ప్రతినిధులు సీడబ్ల్యూపీఆర్ఎస్ను సంప్రదించాయి. ఎన్డీఎస్ఏ సూచించిన పరీక్షల నిర్వహణకు, అనంతరం చేపట్టే అంశాలకు మార్గదర్శనం చేయాలని కోరారు.
ఈ నేపథ్యంలో తాజాగా సీడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణుల బృందం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను సందర్శించింది. పరీక్షలను ఏవిధంగా నిర్వహించాలనే అంశంపై రాష్ట్ర ఇంజినీర్లు, ఏజెన్సీ ప్రతినిధులకు సూచనలు చేసింది. బరాజ్‌లకు ఎగువ, దిగువ ఇరువైపుల నుంచి 60 మీటర్ల దూరంలో బోర్లు వేసి కోర్ శాంపిళ్లను సేకరించాలని నిపుణుల బృందం నిర్ధారించినట్టు అధికారులు వెల్లడించారు. ఆ శాంపిళ్లను తదుపరి విశ్లేషణకు పంపాలని నిపుణుల బృందం సూచించినట్టు తెలిసింది. పరీక్షల పర్యవేక్షణకు, డాటా విశ్లేషణకు అందించే సాంకేతిక సహకారానికి రూ.2.5 కోట్లు అవసరమని, ఆ మొత్తాన్ని ముందుగానే చెల్లించాలని సీడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణుల బృందం వెల్లడించింది.