మారేడ్‌పల్లి, సెప్టెంబర్ 16: హైదరాబాద్ నగరం మెడికల్ హబ్‌గా మారిందని, ఆఫ్రికన్ దేశాల నుంచి నగరానికి వైద్యంకోసం వస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం సికింద్రాబాద్ సంగీత్ థియేటర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన మెడికవర్ దవాఖానను కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ… రోగులు వైద్యులపై ఎంతో నమ్మకాన్ని పెట్టుకొని దవాఖానలకు వస్తారని వారి నమ్మకాన్ని నిలుపుకునేలా వైద్యాన్ని అందించాలని సూచించారు. నగరం ఫార్మా, ఐటీ, వ్యాక్సిన్, డిఫెన్స్ ఉత్పత్తుల కేంద్రంగా మారిందని గుర్తుచేశారు. కరోనా సమయంలో హైదరాబాద్‌లో ఉత్పత్తైన వ్యాక్సిన్ 150 దేశాలకు సరఫరా చేసిన ఘనత మనదేనని అన్నారు.
అనంతరం కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ… వైద్యో నారాయణ హరి అన్నారని.. దాన్ని వైద్యులు నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు. కార్పొరేటర్ దవాఖానలు, వైద్యులు చికిత్సలో మానవీయ కోణాన్ని విస్మరంచవద్దని సూచించారు. మెడికవర్ దవాఖాన చైర్మన్ ఎండీ డాక్టర్ అనిల్‌కృష్ణ మాట్లాడుతూ.. మెడికవర్ హాస్పిటల్ 12 దేశాల్లో కార్యాకలాపాలు నిర్వహిస్తున్నదని, ఇప్పుడు 24వ దవాఖానను 300 పడకలతో సికింద్రాబాద్‌లో ఏర్పాటుచేశామని తెలిపారు. అత్యుత్త మ స్థాయిలో వైద్యసేవలు అందిస్తామని చెప్పారు. ప్రారంభోత్సవంలో కార్పొరేటర్లు చీర సుచిత్ర, కొంతం దీపిక, దవాఖాన ఈడీ డాక్టర్ శరత్‌రెడ్డి, డాక్టర్లు కృష్ణప్రసాద్, హరికృష్ణ, అంజయ్, గంగాధర్‌రెడ్డి పాల్గొన్నారు.