Medical Shops | హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ), సుల్తాన్‌బజార్: ఈ-ఫార్మసీలు, ఇన్స్టంట్ డెలివరీ యాప్‌లు తప్పుడు లేదా నకిలీ ప్రిస్క్రిప్షన్లను డెలివరీ చేస్తున్నాయని అఖిల భారత కెమిస్టుల, డ్రగ్గిస్టుల సంఘం(ఏఐఏసీడీ) ఆందోళన వ్యక్తం చేసింది. భౌతిక ఫార్మసీలకు ఉన్నట్టుగానే ఆన్లైన్ ఫార్మసీల పైనా కఠిన నియంత్రణ ఉండాలని డిమాండ్ చేసింది. ఈ-ఫార్మసీలు భారీ రాయితీలు ఇవ్వడం వల్ల వ్యాపారంలో అసమంజసమైన పోటీ నెలకొందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అంశాలన్నింటినీ నిరసిస్తూ ఈ నెల 20న దేశ వ్యాప్త బంద్ పాటిస్తున్నట్టు తెలిపింది. జీఎస్ఆర్ 220(ఇ), 817(ఇ) ప్రభుత్వ నోటిఫికేషన్లలోని లోపాలను ఆసరాగా చేసుకొని నిర్దిష్టమైన నియంత్రణ లేకుండా ఈ-ఫార్మసీలు పని చేస్తున్నాయని ఏఐఏసీడీ ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని ఈ-ఫార్మసీలు తప్పుడు లేదా నకిలీ మందులను డెలివరీ చేస్తున్నాయని ఏఐఏసీడీ జనరల్ సెక్రటరీ రాజీవ్ సింఘాల్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ-ఫార్మసీలు ఇచ్చే 20-50 శాతం రాయితీలను స్థానిక కెమిస్టులు ఇవ్వలేకపోవడంతో వారి వ్యాపారాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఒక్క రోజు బంద్ పాటించనున్నట్టు ఆయన చెప్పారు. దవాఖానలకు అనుబంధంగా ఉండే మందుల షాపులు, ప్రభుత్వ దవాఖానల ఔషధ కేంద్రాలు, 24 గంటల పాటు పని చేసే ఫార్మసీలు, అత్యవసర ఔషధ దుకాణాలు, జన్ ఔషధి కేంద్రాలు బంద్‌లో పాల్గొనవని ఏఐఏసీడీ తెలిపింది. బంద్ వల్ల స్థానిక ఔషధ మార్కెట్లు, సైప్లె చైన్లు, స్థానిక మెడికల్ స్టోర్లపై ఆధారపడే రోగులు, ప్రజలకు కొంత ఇబ్బందులు కలుగవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తున్నది.
మెడికల్ షాపుల మనుగడ ప్రశ్నార్థకం
ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆన్లైన్లో మందుల విక్రయాన్ని నిరసిస్తూ.. నేడు(బుధవారం) మెడికల్ షాపుల రాష్ట్ర వ్యాప్త బంద్ నిర్వహిస్తున్నట్టు ది తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కే.శ్రీనివాస్, టీ.రాజులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం వారు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్(ఏఐఓసీడీ) ఆదేశాల మేరకు రాష్ట్రంలో బంద్‌లో పాల్గొంటున్నట్టు పేర్కొన్నారు. ఏఐ ఆధారిత, నకిలీ ప్రిస్క్రిప్షన్లతో ఈ-ఫార్మసీలు మందుల విక్రయాన్ని జరపడంతో మందులపై నియంత్రణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. యాంటిబయాటిక్స్‌పై నియంత్రణ లేకపోవడంతో యాంటీ మైక్రోబియల్ రెసిస్టిన్స్(ఏఎంఆర్) వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. పెద్ద కార్పొరేటు సంస్థలు భారీ డిస్కౌంట్ల పేరిట మందుల విక్రయాలు జరపడంతో చిన్న మెడికల్ షాపులు తీవ్రంగా దెబ్బ తింటున్నాయని వాపోయారు. కార్పొరేట్ సంస్థల అనైతిక డిస్కౌంట్లను అరికట్టేందుకు ‘లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్’ విధానాన్ని అమలు చేయాలని కోరారు.
బంద్‌కు ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర శాఖ మద్దతు
ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్స్ (ఏఐఓఎస్డీ) పిలుపు మేరకు బుధవారం దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ మద్దతు ప్రకటించింది. డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఈ సమ్మెకు తమ సంఘీభావం తెలుపుతున్నామని తెలంగాణ శాఖ అధ్యక్షుడు డాక్టర్ పీ కిషన్, కార్యదర్శి డాక్టర్ వీ అశోక్, కోశాధికారి డాక్టర్ టీ దయాల్సింగ్లు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.