జహీరాబాద్, మే 31 : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో రోగులకు తిప్పలు తప్పడం లేదు. ముంబై-హైదరాబాద్ 65వ జాతీయ రహదారిపై ఉన్న జహీరాబాద్ ఏరియా దవాఖానలో శుక్రవారం మధ్యాహ్నం కరెంట్ సరఫరా లేకపోవంతో టార్చిలైట్లు, సెల్‌ఫోన్ వెలుతురులో రోగులకు వైద్య సేవలు అందించారు. జనరల్ విభాగంలోని ఓ వార్డులో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఓ మహి ళా రోగి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యులు సెల్‌ఫోన్, టార్చిలైట్ వెలుతురులో బీపీ పరిశీలించి వైద్య పరీక్షలు చేశారు. ఈ విషయమై దవాఖాన సూపరింటెండెంట్ శ్రీధర్‌ను ‘నమస్తే తెలంగాణ’ పలుకరించగా.. శుక్రవారం జనరల్ విభాగంలోని ఒక వార్డులో కరెంట్ సరఫరా నిలిచిపోయిందని, అత్యవసర పరిస్థితిలో మహిళకు టార్చిలైట్, సెల్‌ఫోన్ వెలుతురులో వైద్య పరీక్షలు అందించాల్సి వచ్చిందని చెప్పారు.
వైద్యుల తీరుపై మండిపడ్డ హరీశ్‌రావు
జహీరాబాద్ ఏరియా దవాఖానలో సెల్‌ఫోన్, టార్చిలైట్ వెలుతురులో రోగులకు వైద్య పరీక్షలు చేయడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో కొనసాగుతున్న కరెంట్ కోతలకు ఈ ఘటనే నిదర్శనమని పేర్కొన్నారు.