Arogya Bhadratha | హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): పోలీసు ఆరోగ్య భద్రత కింద లభించే వైద్య సేవలు సోమవారం నుంచి పూర్తిగా బంద్ కానున్నాయి. దవాఖానలకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం నేటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వైద్య సేవలు నిలిచిపోనున్నట్టు తెలుస్తున్నది. తమకు చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం 20వ తేదీలోపు స్పష్టత ఇవ్వాలని తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (టీఎస్హెచ్ఏ) జనవరి 6న ఆరోగ్య భద్రత కార్యదర్శికి లేఖ రాసింది.
కానీ, ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని పోలీసు ఆరోగ్య భద్రత విభాగం అధికారులు చెప్పారు. ఈ విషయమై ఆరోగ్య భద్రత కార్యదర్శిని ‘నమస్తే తెలంగాణ’ వివరణ కోరగా.. ‘ఏమైనా ఉంటే.. 20వ తారీఖు తర్వాత చెప్తాం.. అప్పుడే రాసుకోండి’ అని తేల్చి చెప్పారు.
ఉమ్మడి ఏపీలో 1999లో పోలీసు ఆరోగ్య భద్రతను తీసుకువచ్చారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) శాశ్వత ట్రస్టీగా, ఎక్స్-అఫీషియో చైర్మన్గా 11 మంది సభ్యులతో ఈ పథకాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి ఐజీ (వెల్ఫేర్) స్థాయి అధికారి వైస్ చైర్మన్గా ఉన్నారు. దీని నిర్వహణ బాధ్యతలను కార్యదర్శి చూసుకుంటారు. అయితే, 2024 మే నుంచి రాష్ట్రవ్యాప్తంగా 202 దవాఖానలు ఈ పథకం కింద ఎంప్యానెల్ చేయబడ్డాయి.
ఈ పథకం కింద సభ్యులుగా నమోదైన కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ వరకు రూ.1,600, ఎస్సై నుంచి పై ర్యాంకు అధికారుల వరకు రూ.3200 చొప్పున వారి బ్యాంకు ఖాతా నుంచి ప్రతినెలా కట్ చేస్తారు. ప్రతినెలా నగదు చెల్లిస్తున్నా.. తమవారికి ఆపద వచ్చినప్పుడు వైద్యం చేయించుకోలేకపోతున్నామనే వేదన పోలీసులను కలిచివేస్తున్నది. ప్రభుత్వం తక్షణం స్పందించి బకాయిలు విడుదల చేయాలని పోలీసు కుటుంబాలు వేడుకుంటున్నాయి.