హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): వైద్య విద్యను కేంద్రంలోని బీజేపీ సర్కారు గాలికొదిలేసింది. ఏటికేడు దేశవ్యాప్తంగా వేలల్లో మిగిలిపోతున్న మెడికల్ సీట్లే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గత నాలుగేండ్ల నుంచి దేశవ్యాప్తంగా మెడికల్ సీట్లు వేల సంఖ్యలో ఖాళీగా మిగిలిపోతున్నాయి. ఈ వివరాలను పార్లమెంట్లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ వెల్లడించారు. ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఎంపీ పుట్ట మహేశ్‌కుమార్ అడిగిన ప్రశ్నకు ఆమె నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) పొందుపర్చిన వివరాల ఆధారంగా సమాధానం చెప్పారు. దేశంలో 2022-23లో అత్యధికంగా 4,146 సీట్లు ఖాళీగా మిగిలిపోయినట్టు తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరంలో 2012, 2023-24లో 2,959, 2024-25లో 2,849 సీట్లు ఖాళీగా ఉన్నట్టు వెల్లడించారు.
ప్రభుత్వమెడికల్ కాలేజీల్లో రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్ ప్రక్రియ కఠినతరంగా మారడం, విద్యార్థులు చివరి నిమిషంలో సీట్లను వదిలేయడంతో అవి ఖాళీగా మగిలిపోతున్నాయి. ప్రైవేటు కాలేజీల్లో ఫీజులు భారీగా ఉండటంతో ఈ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీటు దక్కని విద్యార్థులు ఫీజుల భారంతో వైద్య విద్యకు దూరమవుతున్నారు. ఈ అంశంలో కేంద్రం ప్రత్యేక చొరవ చూపాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం మెడికల్ సీట్ల ఖాళీకి కారణమవుతున్నది.
కొత్త మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతులపై కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి ఉన్నా.. ఆ దిశగా ఎలాంటి ముందడుగు పడటం లేదు. వైద్య విద్యకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్నా మెడికల్ సీట్లు ప్రతి ఏడాది వేలల్లో మిగిలిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ఈ అంశంపై కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇప్పటికైనా దృష్టి సారించాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉక్కు సంకల్పంతో వైద్య విద్య జిల్లాలకు చేరింది. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుచేయడంతో స్వరాష్ట్రంలో తెల్లకోటు విప్లవం మొదలైంది. 2014లో స్వరాష్ట్రంగా తెలంగాణ ఏర్పడే నాటికి 5 ప్రభుత్వ, 14 ప్రైవేటు వైద్య కళాశాలు ఉండేవి. వాటిలో 2,850 ఎంబీబీఎస్ సీట్లు ఉండేవి. తెలంగాణ ఏర్పాటు తర్వాత మన పిల్లలను వైద్యులుగా తీర్చదిద్దడమే ధ్యేయంగా కేసీఆర్ నడుం బిగించారు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయించడంతో 2023 అక్టోబర్ నాటికి మొత్తం కళాశాలల సంఖ్య 56కు, సీట్ల సంఖ్య 8,340కి చేరింది.
అప్పటికే కేసీఆర్ ప్రభుత్వం మరో 8 కాలేజీలను మంజూరు చేయడంతో మొత్తం మెడికల్ సీట్ల సంఖ్య 9,140కి చేరింది. బీజేపీ పాలిత రాష్ర్టాలను వెనక్కి నెట్టి కేసీఆర్ హయాంలో తెలంగాణలో మెడికల్ సీట్లు గణనీయంగా పెరిగాయి. ఈ విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో 2024-25 నాటికి 7,000 మెడికల్ సీట్లు మాత్రమే ఉంన్నాయి. కేసీఆర్ ముందు చూపుతో బీజేపీ పాలిత 11 రాష్ర్టాల కన్నా తెలంగాణలో మెడికల్ సీట్లు అధికంగా ఉన్నాయి.
బీజేపీ భాగస్వామిగా ఉన్న 5 రాష్ర్టాలు సైతం మెడికల్ సీట్లలో తెలంగాణతో పోలిస్తే వెనుకబడే ఉన్నాయి. విజన్ ఉన్న నేతగా ఆనాడు కేసీఆర్ మెడికల్ కాలేజీలు, సీట్లు సాధిస్తే కేంద్రంలోని బీజేపీ సర్కారు మాత్రం ఎంబీబీఎస్ సీట్లు మిగిలిపోతున్నాయని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించడం పట్ల విద్యావేత్తలు మండిపడుతున్నారు. ఈ అంశంతో కేసీఆర్ పాలనదక్షత, ముందుచూపు బయటపడితే వైద్య విద్య పట్ల బీజేపీ చిత్తశుద్ధి ఏ పాటిదో తేలిపోయిందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.