e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home Top Slides టెస్టులకన్నా ప్రాణాలే ముఖ్యం!

టెస్టులకన్నా ప్రాణాలే ముఖ్యం!

టెస్టులకన్నా ప్రాణాలే ముఖ్యం!
  • లక్షణాలుంటే చికిత్స ప్రారంభించాల్సిందే
  • అప్పుడే వ్యాధి తీవ్రత తగ్గించే అవకాశం
  • ఆశా వర్కర్ల ద్వారా పరిస్థితిని తెలుపాలి
  • ప్రభుత్వం ఇచ్చే కిట్‌లో మందులు సేఫ్‌
  • ప్రజలకు వైద్యారోగ్యశాఖ సూచనలు

హైదరాబాద్‌, మే 7 (నమస్తే తెలంగాణ): కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి మరింత పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మరింత కట్టడి దిశగా చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే ‘పరీక్షల కన్నా ప్రాణాలే ముఖ్యం’ అనే సూత్రం ఆధారంగా స్థానికంగా విస్తృతంగా ప్రాథమిక చికిత్సకు కావాల్సిన కిట్లను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరి ఆరోగ్య పూర్తి సమాచారం ప్రభుత్వం వద్ద ఉండేలా చర్యలు తీసుకుంటున్నది. కరోనా లక్షణాలు ప్రాథమికంగా గుర్తిస్తే.. వెంటనే చికిత్స ప్రారంభించాలని, పరీక్షల కోసం రోజుల తరబడి వేచిచూసి.. విలువైన కాలాన్ని వృథా చేయకుండా ప్రాణాలను కాపాడుకొనేలా ప్రజలు చైతన్యం కావాలని ప్రచారం చేస్తున్నది. మిగతా రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నది. అలా అని పొంచి ఉన్న ప్రమాదాన్ని విస్మరించాలని కాదని, అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ చెప్తుతున్నది.

పొంచి ఉన్న ప్రమాదం

మొదటి వేవ్‌తో పోల్చితే సెకండ్‌ వేవ్‌ చాలా ఉద్ధృతంగా ఉన్నది. త్వరగా ఒకరి నుంచి పది మందికి సోకుతున్నది. అన్నింటి కంటే ముఖ్యంగా వ్యాధి సోకిన ఐదారు రోజుల్లోనే తీవ్రమవుతున్నది. పైగా ప్రస్తుత కరోనా రూపాలు మార్చుకుంటున్నది. వ్యాధిని గుర్తించి సకాలంలో చికిత్స ప్రారంభించకపోవడం వల్ల దురదృష్టవశాత్తు కొందరు చనిపోతున్నారు. జ్వరం, జలుబు, దగ్గు, తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కండ్లు ఎర్రబడటం, కడుపు నొప్పి, విరేచనాలు లాంటి లక్షణాలున్నవారు వెంటనే జాగ్రత్త పడాలి. ఇంట్లోనే ఐసొలేషన్‌కు వెళ్లి, చికిత్స ప్రారంభించాలి. టెస్టుకు వెళ్లి.. ఫలితాలు వచ్చేదాకా చూద్దామని భావిస్తే.. అది ప్రాణాలపైకి తెచ్చుకున్నట్టేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పరీక్షలు 100 శాతం నిర్ధారించలేవు

ర్యాపిడ్‌ కిట్‌, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు 100% వ్యాధిని నిర్ధారించలేవు. ర్యాపిడ్‌ కిట్‌ 50-60%, ఆర్టీపీసీఆర్‌ 60-70% మాత్రమే నిర్ధారిస్తాయి. పైగా లక్షణాలు లేకున్నా చాలాసార్లు పరీక్షల్లో పాజిటివ్‌ వస్తున్నది. చాలాసార్లు లక్షణాలు ఉన్నా నెగెటివ్‌ కూడా వస్తున్నది. ఈ పరిస్థితిలో ఏ మాత్రం లక్షణాలున్నా వెంటనే చికిత్స ప్రారంభిస్తే ఎలాంటి దుష్ఫలితాలు ఉండవని వైద్యారోగ్యశాఖ స్పష్టంచేస్తున్నది. 90% మందిలో లక్షణాలు కనిపించిన వెంటనే 5-6 రోజులపాటు కొన్ని జాగ్రత్తలు, మందులు తీసుకుంటూ ఇంటివద్దే నయం చేసుకోవచ్చని సూచిస్తున్నది. ఈ క్రమంలోనే లక్షణాలను త్వరగా గుర్తించడానికి ప్రభుత్వం ఇంటింటి సర్వే చేపట్టింది. లక్షణాలున్నవారికి చికిత్స కిట్‌ను అందిస్తున్నది.

కిట్‌లో ఉండేవి..

ప్రభుత్వం అందిస్తున్న కిట్‌లో ఉండే మందులు వాడటం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉండవని వైద్యనిపుణులు చెప్తున్నారు. ఇందులో జ్వరానికి సాధారణంగా వాడే పారాసిటమల్‌, జలుబుకు వాడే లెవో సిట్రిజిన్‌, తేలికపాటి యాంటిబయాటిక్‌ అయిన డోక్సిసైక్లిన్‌, మాత్రల వల్ల కడుపులో మంట రాకుండా రానిటాక్‌ మినహా.. మిగిలినవన్నీ బలాన్నిచ్చేవి, వ్యాధి నిరోధకశక్తిని పెంచేవే. 5-8 రోజుల్లో ఈ కిట్‌లోని మందులతో చికిత్స పొందినా లక్షణాలు తగ్గకపోయినా, ఆయాసం, ఊపిరి అందటంలో ఇబ్బంది, ఆక్సిజన్‌ 90 కంటే దిగువకు పడిపోవడం లాంటివి ఉన్నప్పుడే దవాఖానలో చేరాలి. ముందే ఇంటి వద్ద తీసుకున్న చికిత్సతో వైరస్‌ తీవ్రత తగ్గడం, ప్రాణాపాయం లేకుండా త్వరితగతిన ఇంటికి చేరడం సాధ్యపడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఈ మందులతోపాటు మంచి పోషకాహారం, పండ్లు, పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు, ఓఆర్‌ఎస్‌ లాంటి ద్రవపదార్థాలు కూడా తీసుకుంటూ మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే వ్యాధి త్వరగా నయమైపోతుంది.

పూర్తి సంసిద్ధంగా ఉన్నాం

ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌, వ్యాక్సిన్ల కొరత దేశవ్యాప్తంగా ఉన్నట్టే మన రాష్ట్రంలోనూ ఉండటాన్ని గమనించిన సీఎం కేసీఆర్‌ వెంటనే ఈ సమస్యను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రధాని స్పందించి సంబంధిత మంత్రులు, అధికారులను సత్వరం స్పందించాల్సిందిగా ఆదేశించారు. వ్యాక్సిన్‌, మందులు, ఆక్సిజన్‌ ఉత్పత్తిదారులతో సీఎం నేరుగా సంప్రదించి సహాయం కోరగా, దానికి వారు స్పందించి హామీకూడా ఇచ్చారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నాం. కరోనా రెండో దశలో హైదరాబాద్‌ ఒక మెడికల్‌ టూరిజం కేంద్రంగా మారింది. వైద్యనిపుణులు, ప్రపంచస్థాయి సౌకర్యాలు కలిగిన దవాఖాలున్న నగరంగా గుర్తింపు వచ్చింది. దీంతో వివిధ రాష్ర్టాల నుంచి రోగులు ఇక్కడికి వస్తున్నారు. దవాఖానల్లో పడకలు, ఆక్సిజన్‌, ఐసీయూ, వెంటిలేటర్‌ పడకలు, మందుల లభ్యతపై ఒత్తిడి పెరుగుతున్నా, వచ్చిన వారందరికీ మానవతా దృక్పథంతో చికిత్స అందిస్తున్నాం. జాగ్రత్తగా ఉండి.. ప్రభుత్వ నిర్ణయాలను కచ్చితంగా పాటిస్తే, నెలాఖరుకు కరోనా రెండో వేవ్‌ విజృంభణ నుంచి తీవ్రంగా నష్టపోకుండా బయటపడతాం. అందరం కలిసి.. 3వ, 4వ వేవ్‌లు వస్తాయనే అంచనాలను వమ్ము చేసేలా ముందుకు సాగాలి.
జీ శ్రీనివాసరావు, డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
టెస్టులకన్నా ప్రాణాలే ముఖ్యం!

ట్రెండింగ్‌

Advertisement