హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): గత నవంబర్‌లో రికార్డుస్థాయిలో 46,340 మంది సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించామని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. గ్రాండ్ హెల్త్ చాలెంజ్ పేరుతో నిర్వహించిన వైద్య పరీక్షల్లో భాగంగా తీవ్రమైన గుండె సమస్యలు ఎదుర్కొంటున్న 300 మంది ఉద్యోగుల ప్రాణాలను కాపాడినట్టు తెలిపారు. హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ దవాఖానలో గ్రాండ్ హెల్త్ చాలెంజ్, సిబ్బంది ఆరోగ్య పరిస్థితిపై మంగళవారం ఆయన సమీక్షించారు. సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించిన కాల్ హెల్త్ సంస్థ ప్రజెంటేషన్‌ను వీక్షించారు. కాల్ హెల్త్ సంస్థ సీఈవో హరి, సీఓవో రత్నేశ్, తరుణ్‌ను సన్మానించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లకు ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం చల్లా చారిటబుల్ ట్రస్ట్, ఆర్టీసీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన నూతన బ్లడ్ బ్యాంక్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో మెడికల్ అడ్వైజర్ సైదిరెడ్డి, సీపీఎం కృష్ణకాంత్, సీఎఫ్ఎం విజయపుష్ప, ఆర్టీసీ దవాఖాన సూపరింటెండెంట్ శైలజ తదితరులు పాల్గొన్నారు.