హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వివిధ బోధనాసుపత్రులకు వైద్య పరికరాలను సరఫరా చేసిన సప్లయర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చెయ్యి చూపుతున్నది. వారికి చెల్లించాల్సిన దాదాపు రూ.49 కోట్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టింది. ఈ బకాయిల విషయమై సీఎం రేవంత్‌రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, హెల్త్ సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)తోపాటు ఆయా హాస్పిటళ్ల సూపరింటెండెట్లను కలిసి వినతిపత్రాలు అందజేసినా ఎలాంటి ఫలితం లేకపోయిందని సరఫరాదారులు చెప్తున్నారు. ఈ క్రమంలో ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డీఎంఈని కలిసి మార్చిలో సైప్లె ఆపేస్తామని తేల్చిచెప్పారు. అయినా ఇప్పటివరకు ప్రభుత్వం ఒక్క పైసా విడుదల చేయకపోవడంపై సరఫరాదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఆరోగ్యశ్రీ’ పథకం కింద సరఫరాచేసే పరికరాలకు సైతం 7 నెలలుగా బకాయిలు చెల్లించడం లేదని వాపోతున్నారు. ఇప్పటివరకు వడ్డీకి అప్పులు తెచ్చి వైద్య పరికరాలు సరఫరా చేశామని, ఇక అలా చేయడం తమవల్ల కాదని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని సరఫరాలను నిలిపివేసిన అసోసియేషన్ ప్రతినిధులు.. మానవతా దృక్పథంతో ఎమర్జెన్సీ కేసులకు మాత్రమే పరికరాలను సరఫరా చేస్తున్నారు.
వడ్డీలకు తెచ్చుకుని సరఫరా
రాష్ట్ర వ్యాప్తంగా టీచింగ్ హాస్పిటల్స్‌కు 80% మందులు, సర్జికల్ ప్రొడక్ట్స్‌ను తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఎంఎస్ఐడీసీ) సరఫరా చేస్తున్నది. కానీ, ఆర్థోపెడిక్, న్యూరో, ప్లాస్టిక్ సర్జరీ ఇంప్లాంట్స్, కార్డియాలజీ, కార్డియో థొరసిస్, యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆప్తల్మాలజీ, ఈఎన్టీ, డెంటల్ చికిత్సలకు అవసరమయ్యే డిస్పోజబుల్స్, పరికరాలతోపాటు కొన్ని రకాల మందులను టీజీఎంఎస్ఐడీసీ సరఫరా చేయడం లేదు. దీంతో వాటి సరఫరా కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచి ప్రైవేట్ సప్లయర్లకు బాధ్యతలు అప్పగిస్తున్నది. కానీ, వారికి పెండింగ్ బకాయిలను చెల్లించకపోవడంతో సమస్యలు తలెత్తతున్నాయి. వైద్య పరికరాల కోసం టీచింగ్ హాస్పిటల్స్‌కు ప్రభుత్వం ఎలాంటి బడ్జెట్ కేటాయించకపోవడమే ఇందుకు కారణం. దీనిపై ఇప్పటికే అనేకసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. పెండింగ్ బకాయిలు చెల్లిస్తేనే వైద్య పరికరాలు సరఫరా చేస్తామని ప్రభుత్వానికి తేల్చి చెప్తున్నారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు ఉన్న పెండింగ్ బిల్లుల వివరాలను తమకు అందజేయాలని ఉన్నతాధికారులు ఇటీవల డీఎంఈ పరిధిలోని దవాఖానల సూపరింటెండెంట్లకు సర్క్యులర్ జారీ చేశారు. దీంతో అంతకు ముందు నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిల సంగతేమిటని అసోసియేషన్ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.
బకాయిలు చెల్లించాలి
బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో వడ్డీకి రుణాలు తెచ్చి వైద్య పరికరాలు సరఫరా చేశాం. ప్రభుత్వం పెం డింగ్ బకాయిలు చెల్లించకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈ సమస్యను ఇప్పటికే సీఎంతోపాటు అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అయినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఇప్పటికైనా స్పందించి బకాయిలు విడుదల చేయాలి.
– కేబీ రామచంద్ర, ట్విన్ సిటీస్ సప్లయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
పెండింగ్ బకాయిల వివరాలు దవాఖాన బకాయిలు