కుమ్రంభీం ఆసిఫాబాద్ : కాంగ్రెస్ పాలనో అన్ని వర్గాల ప్రజల నుంచి నిరసన, ప్రదర్శనలు వ్యక్తమ వుతున్నాయి. తాజాగా ఆసిఫాబాద్‌లోని (Asifabad) కళాశాలలో కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం మెడికల్ కళాశాల(Medical college) విద్యార్థులు ధర్నా చేపట్టారు. యూనిఫామ్‌ని ధరించి కళాశాల ఎదుట బైఠాయించారు. కళాశాలలో మొదటి సంవత్సర విద్యార్థులకు బోధించేందుకు కనీసం అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా లేని దుస్థితి నెలకొందని మెడికల్ విద్యార్థులు ఆరోపించారు.
మొదటి సంవత్సరం విద్యార్థులకు సరైన హాస్టల్ వసతి కూడా లేదని, కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా హాస్టల్లో ఏర్పాటు చేయటం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై కళాశాల ప్రిన్సిపాల్ అడిగేందుకు ప్రయత్నిస్తే విద్యార్థుల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆరోపించారు. అక్టోబర్‌లో ప్రారంభం కావాల్సిన మెడికల్ కళాశాల తరగతులు డిసెంబర్లో ప్రారంభించి తమ రెండు నెలల కాలం వృథా చేశారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆసిఫాబాద్‌లోని మెడికల్ కళాశాలలో సరిపడా ప్రొఫెసర్లను నియమించాలని, హాస్టల్లో విద్యార్థుల కోసం కనీస వసతులైన కల్పించాలని వారు డిమాండ్ చేశారు.