హైదరాబాద్ సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ)/రంగారెడ్డి : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా యూఎల్సీ, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్‌ను అవినీతి నిరోధకశాఖ శుక్రవారం అరెస్ట్ చేసింది. నిందితుడి వద్ద రూ. 6,22,38,800 విలువైన ఆస్తులతోపాటు అబ్దుల్లాపూర్‌మెట్‌లోని పిగ్లీపూర్ గ్రామ పరిధిలో 8 ఎకరాల అనుమానాస్పద భూమికి సంబంధించిన పత్రాలను గుర్తించినట్టు ఏసీబీ వెల్లడించింది. మార్కెట్లో ఈ ఆస్తుల విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న మర్రి వంశీమోహన్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు దృష్టిపెట్టారు.
శుక్రవారం వనస్థలిపురంలోని వంశీమోహన్ ఇంటితోపాటు అతని బంధువులు, బినామీలు, అతనితో కలిసి లావాదేవీలు జరిపిన వారిని గుర్తించి 11చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ నేతృత్వంలో ఈ తనిఖీలు జరిగాయి. సోదాల్లో రూ.4,46,28,000 విలువైన 19 ఓపెన్ ప్లాట్స్ డాక్యుమెంట్లు, ఎన్జీవో కాలనీలో ఒక ఇండిపెండెంట్ ఇల్లు, మణికొండ, మజీద్‌బండలో ఒక్కో ఫ్లాట్, ఇబ్రహీంపట్నం నర్రెపల్లిలో రెండు ఎకరాల్లో ఫామ్‌హౌస్(రూ.10 లక్షలు) ఉన్నట్టు గుర్తించారు. బ్యాంకులో రూ.20 లక్షల నగదు, 122 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.32 లక్షల విలువైన ఇన్నోవా క్రిస్టా, కియా కార్లను గుర్తించినట్టు వెల్లడించారు. మరిన్ని ఆస్తులు ఉన్నట్టు అనుమానాలున్నాయని, దర్యాప్తులో ఆ విషయాలు వెలుగులోకి వస్తాయని ఏసీబీ అధికారులు వివరించారు.
ఇందులో భాగంగానే అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పిగ్లీపూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్-17లో 8 ఎకరాల భూమిని 2023లో వంశీమోహన్ మామ విజయ్‌భాస్కర్ పేరున రిజిస్ట్రేషన్ అయ్యిందని, దీనిని ఆ తర్వాత ఓ రియల్టర్‌కు ధారాదత్తం చేసినట్టు గుర్తించి, మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. రియల్టర్ నుంచి 10 ప్లాట్లు గిఫ్ట్‌డీడ్ చేయించుకున్నట్టు గుర్తించారు. ఈ మేరకు డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు.