సిటీబ్యూరో: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ గ్రేటర్లో నత్తనడకన సాగుతున్నది. బీఎల్వోల నిర్లక్ష్యం, ఎన్నికల కమిషన్ అధికారుల అలసత్వం, ఓటర్ల అవగాహనలోపంతో సర్ ప్రక్రియలో గందరగోళం నెలకొంది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్యుమరేషన్ ఫారాలు ఇప్పటికీ బీఎల్వోల దగ్గర కుప్పలుగా పడిఉన్నాయి. గ్రేటర్ వ్యాప్తంగా ఏ పోలింగ్ కేంద్రంలో చూసినా వివరాలు నింపకుండా, ఓటర్లకు పంపిణీ చేయకుండా ఉన్న ఖాళీ ఎన్యుమరేషన్ ఫారాలు దర్శనమిస్తున్నాయి.
పంపిణీ వంద శాతం పూర్తయినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నా.. తమ వద్దే ఎందుకు పెట్టుకున్నారని బీఎల్వోలను ప్రశ్నిస్తే.. ఓటర్లు వచ్చి తీసుకెళ్లడం లేదని బదులిస్తున్నారు. అదేవిధంగా వివరాలు నమోదు చేసిన ఫారాలు కూడా అలాగే అట్టిపెట్టుకుంటున్నారు. ఇదేమిటని అడిగితే.. ఆన్లైన్ ప్రక్రియలో సమస్యలొస్తున్నాయని చెబుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఆగస్టు 3 నాటికి గ్రేటర్లో సర్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఏమాత్రం కనిపించడంలేదు. కాగా, కీలకమైన డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా 50 శాతం కూడా దాటకపోవడం గమనార్హం.