కవాడిగూడ, జూలై 23ః నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జీ చేయడం దుర్మార్గమని పలువురు వక్తలు అన్నారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని, పేపర్ లీకేజీకి బాధ్యులైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని,విద్యార్థుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉమెన్స్ అండ్ ట్రాన్స్‌జెండర్స్ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్కు వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమంలో ప్రొఫెసర్ రమా మెల్కోటే, అరుణోదయ విమలక్క, పీఓడబ్ల్యూ సంధ్య, సామాజికవేత్త సజయ, ఝాన్సీ, కొండవీటి సత్యవతి, అనురాధ, వసుదనాగరాజు, స్వరూపారావు, హ్యూమన్‌రైట్స్ ఫోరం అధ్యక్షుడు జీవన్‌కుమార్, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కనీనర్ పి.శంకర్, ట్రాన్స్‌జెండర్స్ ఆక్టివిస్ట్ ఖాళి, బిలాల్ తదితర సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతు కేంద్ర ప్రభుత్వం నీట్ పేపర్ లీకేజీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని , పేపర్ లీకేజీ కారణంగా అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం న్యాయం కోసం పోరాడే విద్యార్థులపై లాఠీలు జులిపించి అక్రమ కేసులు బనాయించడం అత్యంత దారుణమన్నారు.