ములుగు, జనవరి 28(నమస్తే తెలంగాణ) : కన్నెపల్లి కల్పవల్లి బుధవారం సారలమ్మ గ ద్దెను చేరడంతో మేడారం మహాజాతరలో తొలి అంకం మొదలైంది. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు తరలివచ్చి మేడారం గుడి వద్ద సారలమ్మకు స్వాగతం పలుకగా, ముగ్గురి రాకతో మేడారమంతా సంబురంతో ఓలలాడింది. వనదేవతల దర్శనానికి జనం ప్రవాహంలా తరలివచ్చింది. అటు జంపన్న వాగు జనసందోహంతో కిక్కిరిసిపోయింది. రెండేండ్ల ఎదురుచూపుల తర్వాత సారలమ్మ గద్దెకు చేరుకోవడంతో ఒక్కసారిగా భక్తకోటి పరవశించిపోయింది. సారలమ్మ.. సల్లంగ సూడు తల్లీ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా భక్తిపారవశ్యం తో ఊగిపోయింది. కన్నెపల్లి నుంచి మేడారం వరకు భక్తజనం సారలమ్మకు జేజేలు పలుకు తూ ప్రణమిల్లింది. తొలి ఘట్టం ఎలాంటి ఆ టంకాలు లేకుండా పరిపూర్ణమైంది.
సారలమ్మ రాక కోసం తెల్లవారుజాము నుం చే భక్తజనం తాకిడి మొదలైంది. సారలమ్మను తోడ్కొని వచ్చే ప్రధాన పూజారి(వడ్డె) కాక సా రయ్య సహా ఇతర వడ్డెలు తొలుత గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాల తర్వాత ఆనవాయితీ ప్రకారం కన్నెపల్లి నుంచి 16మంది ఆడబిడ్డలు డోలి విన్యాసాలతో తరలివచ్చి తల్లీబిడ్డలైన సమ్మక్క-సారలమ్మ కొలువుదీరే గద్దెలపై ముగ్గులు పెట్టి కంక వనానికి కంకణాలు కట్టారు. మధ్యాహ్నం 3గంటల నుంచే సారలమ్మ గుడి వద్ద డోలి విన్యాసాలు, తుడుందెబ్బ, ఆదివాసీ విద్యార్థి పరిషత్, సారక్క యువజన సంఘం బృందాల కళా ప్రదర్శనలు నాలుగు గంటల పాటు కోలాహలం నెలకొన్నది.
మంత్రి సీతక్క, జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కన్నెపల్లి సారలమ్మ గుడి నుంచి రాత్రి 7.41గంటలకు మేడారంలోని గద్దెల వరకు తోడ్కొని బయలుదేరారు. కన్నెపల్లిలో ఇల్లిల్లూ తమ ఇంటి ఆడబిడ్డకు నీళ్లారగించి, చీరసారె పెట్టి, కొబ్బరికాయలు కొ డుతూ మంగళహారతులు పట్టారు. కన్నెపల్లిలో వాడవాడనా తిరుగుతూ సారలమ్మను సాగనంపారు.
అక్కడినుంచి రాత్రి జంపన్న వాగుకు చేరుకున్నది. జంపన్న తన అక్క సారలమ్మ కాళ్లు కడిగి(జంపన్నవాగు మీద జంట వంతెనలున్నా సరే కోయ జాతి సంప్రదాయం ప్రకారం వాగులోంచే సారలమ్మను తీసుకురావడం ఆనవాయితీ) మేడారానికి సాగనంపారు. జంపన్నవాగు నుంచి బయలుదేరిన సారలమ్మకు పగిడిద్దరాజు, గోవిందరాజుల వడ్డెలు స్వాగతం పలికారు. ముగ్గురి దేవతల ప్రతినిధులు ప్రత్యేక పూజలు చేయగా డోలి విన్యాసాలు, కొమ్ముబూరల నాదంతో మేడారం మార్మోగింది.
గురువారం చిలుకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి దిగి వచ్చి, భక్తుల మొక్కులు అందు కోనున్నది. ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య సమ్మక్క తల్లిని గద్దెలపై ప్రతిష్ఠించనున్నారు. సాయంత్రం ఐదుగురు సమ్మక్క పూజారులు చిలుకలగుట్టపైకి వెళ్లి కుంకుమ భరిణ రూపంలోని సమ్మక్కను తోడ్కొని చిలుకలగుట్ట చివరి మూలమలుపు వద్దకు వస్తారు. అక్కడ కలెక్టర్ సమ్మక్క తల్లికి స్వాగతం పలుకగానే ఎస్పీ ఏకే 47తో గాల్లోకి తూటాలు పేల్చిన తర్వాత సమ్మక్క గుట్ట దిగుతుంది. అక్కడినుంచి భక్తజన సందోహం నడుమ తల్లి రాకను స్వాగతం పలుకుతూ కోళ్లు, గొర్రెలు, మేకలను బలిస్తూ పూనకాలతో ఊగిపోతారు. సమ్మక్క తల్లి వస్తుందన్న సంకేతంతో జాతర ప్రాంగణం అంతా ఒక్కసారిగా ఉద్వేగానికి లోనవుతుంది. ఈ దశలో పూజారులు చాలా జాగ్రత్తగా తల్లిని తీసుకొని ప్రధాన ద్వారం గుండా గద్దెపైకి చేరుకొని ప్రతిష్ఠిస్తారు.
సారలమ్మ మేడారానికి బయలుదేరిందన్న సమాచారంతో మేడారం జాతర ప్రాంగణం నుంచి భక్తులు తండోపతండాలుగా కన్నెపల్లికి పరుగులు తీశారు. గుడి నుంచి బయటికి వచ్చిన సారలమ్మ కన్నెపల్లిలో వాడవాడనా బిడ్డలకు దీవెనలిచ్చింది. కన్నెపల్లి నుంచి మేడారం వరకు దాదాపు మూడు కిలోమీటర్ల పొడవునా దారి మొత్తం జన సందోహంతో పోటెత్తింది. భక్తుల శివసత్తుల పూనకాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ఎదురుకోళ్లు సమర్పిస్తూ, ఒడిబియ్యం చల్లుతూ, కొబ్బరికాయలు కొడుతూ భక్తజనం సారలమ్మకు నీరాజనం పలికింది.
తుడుందెబ్బ సహా పలు ఆదివాసీ సంఘాలు త్రివలయ విధానంతో సారలమ్మకు రక్షణగా నిలిచారు. పోలీసులు సైతం రెండు రోప్ పార్టీలు, రోడ్ క్లియరెన్స్ పార్టీలు ఏర్పాటుచేసి ఎలాంటి తొక్కిసలాట జరుగకుండా చేశారు. సారలమ్మ మేడారం గుడిలోకి చేరగానే ఆదివాసీ సంప్రదాయ విన్యాసాలతో డోలి మోతలు, కొమ్ము బూరల నాదాలతో దద్దరిల్లాయి. ప్రత్యేక పూజలు ముగిసిన తర్వాత ముగ్గురు కలిసి మేడారం గద్దెల ప్రాంగణానికి బయలుదేరారు. సరిగ్గా అర్ధరాత్రి 12.20 గంటలకు సారలమ్మను గద్దెపై ప్రతిష్ఠించారు. అలాగే పగిడిద్దరాజు, గోవింద రాజులు వారివారి గద్దెలపై ఆసీనులయ్యారు.