హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : వన దేవతలు సమ్మక సారలమ్మను కొలుస్తూ ప్రతి రెండేండ్లకు ఒకసారి ఎంతో వైభవోపేతంగా జరుపుకొనే అతిపెద్ద ఉత్సవం మన మేడారం జాతర అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పేర్కొన్నారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపడుతూ సమ్మక సారలమ్మ మహా జాతర సాగుతుందని తెలిపారు. పోరాట స్ఫూర్తి, త్యాగనిరతికి సమ్మక సారలమ్మ ప్రతీకలని తెలిపారు. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యే తెలంగాణ కుంభమేళా మేడారం జాతర సందర్భంగా.. ఆ తల్లుల దీవెనలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. మేడారం జాతర సందర్భంగా భక్తులందరికీ మంగళవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మే డారం మహాజాతర సందర్భంగా భక్తజన కోటికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈనెల 31 వరకు జరిగే మహాజాతరకు తరలివచ్చే భక్తజనానికి ఇబ్బందులు తలెత్తకుండా, ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
మహదేవపూర్, జనవరి 27 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మం డలం అంబట్‌పల్లిలోని మేడిగడ్డ (లక్ష్మీ ) బరాజ్ వంతెనపై నుంచి వాహనాల రాకపోకలు అనుమతించకపోవడంతో మేడారం జాతరకు వెళ్లే మహారాష్ట్ర భక్తులు ఇబ్బందులు పడ్డారు. బరాజ్ భద్రతా చర్యల్లో వాహనాలను నిలిపివేశారు. బరాజ్‌పై గేట్లు తెరిచి భక్తుల వాహనాలను అనుమతించాలని అధికారులను కోరగా నిరాకరించారు.