గుండాల, జనవరి 26 : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరకు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం యాపలగడ్డ గ్రామానికి అవినాభావ సంబంధం ఉంది. పగిడిద్దరాజు ఇక్కడి నుంచి బయలుదేరితేనే మేడారం మహాజాతర ప్రారంభమవుతుంది. రెండేళ్లకోసారి మేడారంలో జరిగే సమ్మక్క-సారక్క జాతరకు సమ్మక్క భర్త పగిడిద్దరాజును యాపలగడ్డకు చెందిన అరెం వంశీయులు తీసుకెళ్లడం ఆనవాయితీ.
సోమవారం పగిడిద్దరాజు గర్భగుడి వద్ద పడగ (జెండాలకు)లు, పురాతన ఆభరణాలకు మేడారం ట్రస్ట్ చైర్పర్సన్ ఇర్ప సుకన్య, మాజీ చైర్మన్ అరెం లచ్చుపటేల్, సమ్మక్క ప్రధాన పూజారి సిద్దబోయిన స్వామి పగిడిద్దరాజుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండురోజులపాటు పాదయాత్ర చేస్తూ మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పెనక వంశీయులను కలుపుకొని మేడారం వెళ్లనున్నారు. రాత్రి కొడిశల గ్రామంలో, మంగళవారం జంపన్నవాగులో బసచేస్తారు.
పగిడిద్దరాజుతోపాటు కొండాయిగూడెం నుంచి గోవిందాజును, కన్నెపల్లి నుంచి సారలమ్మను ఆయా గ్రామాల పూజారులు తీసుకొస్తారు. ఆ ముగ్గురు వనదేవతలకు మేడారంలోని గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బుధవారం పగిడిద్దరాజును గద్దెలపై నియమ నిష్టలతో ప్రతిష్ఠిస్తారు. గురువారం సమ్మక్క(దేవత)ను చిలకలగుట్ట నుంచి గద్దెల మీదకు తీసుకురావడంతో మేడారం మహాజాతర ప్రారంభమవుతుంది. శుక్ర, శనివారం భక్తులు వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. తిరిగి సమ్మక్కను శనివారం సాయంత్రం పూజారులు(వడ్డెలు) చిలకలగుట్టకు తీసుకెళతారు. అరెం వంశీయులు పగిడిద్దరాజును పాదయాత్రతో గుండాలకు చేర్చుతారు. దీంతో జాతర ముగుస్తుంది.