MLA Mainampally Rohit | హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మరో వివాదంలో చిక్కుకున్నారు. వందల కార్లతో హైదరాబాద్ నుంచి సిద్దిపేట వెళ్తూ.. కారు ఓపెన్‌టాప్‌పై ఆయన, అనుచరగణం చేసిన స్టంట్లపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. తక్షణం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సోమవారం తన ఎక్స్ వేదికగా రోహిత్ ఓ వీడియో అప్లోడ్ చేశారు. అందులో తాను వందల కార్ల కాన్వాయ్‌తో రోడ్డు మొత్తం బ్లాక్ చేస్తూ వెళ్తున్నట్టు స్పష్టంగా ఉన్నది. ఆ వీడియోకు ‘హరీశ్‌రావు ఇగ కాస్కో బిడ్డా.. మైనంపల్లి దెబ్బ..’ అంటూ ట్యాగ్‌లైన్ ఇచ్చారు. ఆ వీడియోలో.. రోహిత్ కారు ఓపెన్‌టాప్‌పై నుంచి అభివాదం చేస్తూ వాహనదారులకు ఇబ్బందులు కలిగించారు. దీనికితోడు ఆయన అనుచరులు కార్ టాప్‌లపై హల్చల్ చేస్తున్నట్టు స్పష్టంగా కనిపించింది.
ఓ ప్రజాప్రతినిధి అయ్యుండి.. తన ప్రవర్తనతో ప్రజలను ఇబ్బంది పెట్టడం ఏమాత్రం బాగోలేదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ‘తక్కువస్థాయికి పడిపోతున్నావ్’ అని, ‘ఒక ఎమ్మెల్యేగా ఇలాంటి థర్డ్ క్లాస్ స్టంట్స్ చేయడానికి సిగ్గుండాలి. తెలంగాణలో న్యాయబద్ధమైన పాలన ఉన్నదా?’ అంటూ ఓ నెటిజన్ డీజీపీని ట్యాగ్ చేశారు. ‘ఇట్లాంటివి చేయడం హేళనకరం, ఇండియా కూటమికి ఓటు వేసిన ప్రజలు మూర్ఖులు’ అంటూ మరో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇట్లాంటి అసభ్య ప్రవర్తనలకు కూడా అనుమతి ఇస్తారా’ అని కొరీనా సురేశ్ అనే నెటిజెన్ డీజీపీని ట్యాగ్ చేశారు. ‘ఇలా చేయడం పూర్తిగా చట్ట విరుద్ధం. వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇది ఫ్యూడల్ హైదరాబాద్ కాదు’ అని సీఎంవో, డీజీపీకి మరో నెటిజన్ విజ్ఞప్తి చేశారు.