మెదక్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా వాస్తవమేనని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ స్పష్టం చేశారు. ఈటల భూముల అంశంపై మెదక్ కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట్ పరిధిలో అసైన్డ్ భూములను జమునా హ్యాచరీస్ కబ్జా చేసింది వాస్తవమేనని చెప్పారు. 70.33 ఎకరాల భూమిని కబ్జా చేసినట్లు రెవెన్యూ అధికారుల సర్వేలో తేలిందన్నారు.
అచ్చంపేట, హకీంపేట పరిధిలో గల సర్వే నంబర్ 77 నుంచి 82, 130, హకీంపేట్ శివారులో గల సర్వే నంబర్ 97, 111లో సీలింగ్ భూములను కబ్జా చేశారు. సర్వే నంబర్ 78, 81, 130లలో భారీ పౌల్ట్రీ షెడ్స్, ప్లాట్‌ఫామ్‌లు, రోడ్లను అనుమతి లేకుండా నిర్మించారు. సర్వే నంబర్ 81లో 5 ఎకరాలు, 130లో 3 ఎకరాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మొత్తంగా 56 మంది అసైనీల భూములను కబ్జా చేసినట్లు తేలిందన్నారు.
అసైన్డ్ భూములను వ్యవసాయేతర అవసరాలకు వాడుతున్నారు. అనుమతులు లేకుండా పెద్ద పెద్ద షెడ్డులు నిర్మించారు. నిషేధిత జాబితాలోని భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి అటవీ ప్రాంతంలో చెట్లు నరికి, రోడ్డు వేశారు. పౌల్ట్రీ నుంచి కాలుష్యం వెదజల్లుతున్నట్లు గుర్తించామన్నారు. మొత్తానికి అసైన్డ్ భూముల కబ్జా, అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వానికి నివేదిక పంపాం. అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరీశ్ స్పష్టం చేశారు. అక్రమాలకు సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత అసైనీలకు న్యాయం చేసేలా ప్రభుత్వానికి నివేదిక పంపామని కలెక్టర్ హరీశ్ పేర్కొన్నారు.