హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : తెలంగాణను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నారు. విద్యాశాఖ సహకారంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 22 వేల ప్రత్యేక క్లబ్‌లను (ప్రహారీ క్లబ్‌లు) ఏర్పాటు చేసినట్టు టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు అలవాటుపడే అవకాశమున్న విషయాన్ని ఈ క్లబ్‌ల ద్వారా గుర్తిస్తామని వెల్లడించారు. వెంటనే ఇద్దరు డీఎస్సీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బందితో కూడిన టీం ఆయా పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు అవగాహన కల్పిస్తుందని చెప్పారు. ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నట్టు, అమ్ముతున్నట్టు తెలిస్తే యాంటీ నార్యోటిక్ బ్యూర్ టోల్ ఫ్రీ నంబర్ 1908కి లేదా కంట్రోల్ రూమ్ నంబర్ 8712671111కు లేదా tsnabho hyd @tspolice. gov.inకు మెయిల్ ద్వారా తెలియజేయాలని సందీప్ శాండిల్య సూచించారు. సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, సరైన సమాచారం ఇచ్చిన వారికి తగిన పారితోషికం కూడా ఇస్తామని ప్రకటించారు.