హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): జంతువుల జనాభా నియంత్రణ నిబంధనలు-2023 ప్రకారం వీధి కుక్కల జనాభా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ సూచించారు. జంతువుల జనాభా నియంత్రణ నిబంధనల్లో కొత్తగా వచ్చిన సవరణలపై బుధవారం హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో వర్క్‌షాప్ నిర్వహించారు. ఇందులో పురపాలకశాఖ డీఎంఏ సత్వనారాయణతోపాటు జీహెచ్ఎంసీ, వివిధ మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, మున్సిపాలిటీల కమిషనర్లు, స్థానిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్వింద్ కుమార్ మాట్లాడుతూ సవరించిన నిబంధనలను సమగ్రంగా అధ్యయనం చేసి, అందుకు అనుగుణంగా కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.