హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం లో వ్యవసాయానికి, కులవృత్తులకు అవినాభావ సంబంధమున్నదని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉచిత విద్యుత్తును అందిస్తున్నదని, దీనిపై అవగాహన రాహిత్యంతో రేవంత్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉచిత విద్యు త్తు జోలికి వస్తే ఉతికి ఆరేస్తామని మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.
ఉమ్మడి ఏపీలో నాయీబ్రాహ్మణులు నెలకు 150 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇవ్వాలని కోరినా కాంగ్రెస్ పాలకులు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. కానీ నేడు సీఎం కేసీఆర్ 1.8 లక్షల మందికి నెలకు 250 యూనిట్ల విద్యుత్తును అందిస్తున్నారని కొనియాడారు. చేనేత, కంసాలి, కంచరి, కుమ్మరి, వడ్రంగి తదితర కులవృత్తులకు అతితక్కువ ధరకు విద్యుతును అందిస్తున్న రాష్ట్రం తెలంగాణే అని స్పష్టంచేశారు. కులవృత్తిదారులకు లక్ష ఆర్థిక సాయా న్ని అందిస్తున్నదని గుర్తుచేశారు. రేవంత్ విద్యుత్తుపై అసత్య ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు.