హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదు కాగా, నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 43.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొన్నది. రాష్ట్రంలో మే 5వరకు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. బుధవారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అకడకడ ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని వెల్లడించింది.
హీట్‌వేవ్‌పై జాగ్రత్త అవసరం
రాష్ట్రంలో హీట్‌వేవ్‌తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డీహెచ్ డాక్టర్ రవీందర్‌నాయక్ సూచించారు. ఎండలు పెరిగిన నేపథ్యంలో మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దాహం వేయకపోయినా తగిన మోతాదులో నీరుతాగాలని కోరారు. ఓఆర్‌ఎస్‌తోపాటు, నిమ్మరసం, బటర్‌మిల్క్ తాగాలని అన్నారు. ప్రయాణాలు చేసే సమయాల్లో వాటర్‌బాటిల్స్ తప్పకుండా తీసుకెళ్లాలని పేర్కొన్నారు.