Nizamabad | నిజామాబాద్ క్రైం, జనవరి 14: ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి బ్యాగులో నుంచి రూ.11.80 లక్షలను దుండగులు అపహరించిన ఘటన నిజామాబాద్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్నది. జగిత్యాల జిల్లాకు చెందిన హన్మంతు ముంబైలో ఓ తాడి(కల్లు) బట్టీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆ బట్టీ యజమాని కూడా జగిత్యాలకు చెందినవాడే. హన్మంతు సంక్రాంతి పండుగ కోసం ముంబై నుంచి జగిత్యాలకు వస్తుండగా.. బట్టీ యజమాని రూ.11.80 లక్షలను హన్మంతుకు ఇచ్చి తన ఇంట్లో ఇవ్వాలని చెప్పాడు. హన్మంతు ఆ డబ్బులను తీసుకొని శనివారం మధ్యాహ్నం ముంబైలో ఓ ప్రైవేటు బస్సులో ఎక్కాడు.
ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్సపల్లి వద్ద ఉన్న భవానీ హోటల్లో టీ తాగేందుకు డ్రైవర్ బస్సును నిలిపాడు. అదే సమయంలో హన్మంతు డబ్బులతో ఉన్న బ్యాగును సీటుపై పెట్టి కిందకు దిగాడు. సుమారు అరగంటపాటు బస్సు నిలపడంతో ఇదే అదునుగా భావించిన దుండగులు సీటులో ఉన్న బ్యాగుతో ఉడాయించారు. బస్సు కదిలే సమయంలో హన్మంతు వచ్చి చూడగా తన సీటుపై ఉంచిన డబ్బుల బ్యాగు కనిపించలేదు. చోరీకి గురైందని గ్రహించి వెంటనే బస్సు డ్రైవర్‌కు చెప్పడంతో ఆరో టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సౌత్ రూరల్ సీఐ వెంకట నారాయణ, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. డబ్బులు ఉన్న బ్యాగును మాస్క్ ధరించి వచ్చిన దుండగుడు తీస్తున్నట్టుగా బస్సులోని సీసీ కెమెరాలో రికార్డయ్యింది. నిందితుడి వెంట వచ్చిన మరో ఇద్దరు కూడా బస్సు డోర్ వద్ద నిలబడి ఉండటం సీసీ కెమెరాలో రికార్డయ్యింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆరో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. చోరీ జరిగిన ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.