మధిర రూరల్, మార్చి 21 : కోల్డ్ స్టోరేజీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో రూ.25 కోట్ల విలువైన రైతుల మిర్చి పంట దగ్ధమైన ఘటన ఖమ్మం జిల్లాలో శనివారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా మధిర మండలం ఆతూర్ సమీపంలో మధిర – వైరా రోడ్డులో ఉన్న సాయిబాలాజీ కోల్డ్ స్టోరేజీలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా శనివారం సాయంత్రం మంటలు చెలరేగాయి. కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉన్న మిర్చి బస్తాలకు మంటలు అంటుకోవడంతో వేగంగా వ్యాపించి, దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు వెంటనే పోలీసులు, ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది, పోలీసులు మంటలను ఆర్పే ప్రక్రియ మొదలుపెట్టారు.
మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో మధిర, వైరాతోపాటు మరో ఫైర్ ఇంజిన్‌ను తెప్పించి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రయోజనం కనిపించడంలేదని ఫైర్ సిబ్బంది పేర్కొన్నారు. సాయిబాలాజీ కోల్డ్ స్టోరేజీలో 300 మంది రైతులకు సంబంధించిన రూ.25 కోట్ల విలువైన 28 వేల మిర్చి బస్తాలు నిల్వ ఉన్నాయి. ఈ కోల్డ్ స్టోరేజీలో ఏపీలోని గంపలగూడెం, తెలంగాణలోని బోనకల్లు, మధిర మండలాల రైతులు తమ మిర్చి బస్తాలను నిల్వ ఉంచారు. కష్టార్జితమంతా బుగ్గిపాలు కావడంతో కర్షకులు కన్నీటి పర్యంతమయ్యారు. 15 ఏండ్ల క్రితం దెందుకూరు సమీపంలో వల్లభ కోల్డ్ స్టోరేజీలోనూ ఇదే తరహాలో అగ్ని ప్రమాదం జరిగిందని, అక్కడ కూడా రైతులు తీవ్రంగా నష్టపోయారని గుర్తుచేసుకున్నారు.